
ఉపాధి కూలీల వేదన.. ఖాళీ కంచాలతో నిరసన
ఆజయపురంలో ఖాళీ కంచాలతో
ధర్నా చేస్తున్న గిరిజన ఉపాధి కూలీలు
రావికమతం: మూడు మాసాల నుంచి ఉపాధి మామీ కూలీ చెల్లింపులు చేయకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని చీమలపాడు పంచాయతీ పరిధిలో గల గిరిజన ఉపాధి కూలీలు సోమవారం ఖాళీ కంచాలతో ధర్నా చేశారు. నేరేడుబంద, ఆజయపురం, జీలుగలోవ గ్రామాల్లో ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు పనిచేసిన ఉపాధి కూలీలకు నగదు తక్షణమే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘం 5 వ షెడ్యూల్ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఖాలీ కంచాలతో భిక్షాటన చేసి, ధర్నా నిర్వహించారు. ఉపాధి హమీ చట్టం ప్రకారం పనిచేసిన ప్రతి ఉపాధి కూలీకి పేస్లిప్‌లు ఇచ్చి, రెండు పూటలు పని చేయాలనే నిబంధనలు రద్దు చేయాలన్నారు. ప్రతి 15 రోజులకు ఉపాధి బకాయిలు ఇవ్వకపోవడంతో ఉపాధివేతన దారులు ఇక్కట్లు పడుతున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కె. గోవిందరావు పేర్కొన్నారు. ఈ ధర్నాలో గిరిజన సంఘం నాయకులు వంతల చిరంజీవి, పాంగి సూరిబాబు, పాంగి శ్రీరామ్ పాల్గొన్నారు.