
ప్రభుత్వ వైద్య కళాశాలలపై ప్రై‘వేటు’ సిగ్గుచేటు
అనకాపల్లి: వైఎస్సార్‌సీపీ పాలనలో పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తే, కూటమి పాలనలో మంత్రి మండలి సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న వైద్య కళాశాలల పీపీపీ విధాన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి.బాబ్జి అన్నారు. పట్టణంలో పలు ప్రాంతాల్లో ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీనిర్వహించి, నెహ్రూచౌక్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 17 వైద్య కళాశాలల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే... అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి 14 వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారని ఆయన గుర్తుచేశారు. రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, విజయనగరం జిల్లాల్లో గత విద్యా సంవత్సరంలో కళాశాలలను ప్రారంభించారన్నారు. జగన్ ప్రభుత్వంలో జీవో నంబర్లు 107, 108 ఉత్తర్వుల్ని తీసుకువచ్చి నూతన మెడికల్ కళాశాలల్లో 50 శాతం ఎంబీబీఎస్ సీట్లను ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నారన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తాము అధికారంలోకి వచ్చాక జీవో నెంబర్ 107, 108లు 100 రోజుల్లోనే రద్దు చేసి వైద్య కళాశాలలను నూరుశాతం ప్రభుత్వ కళాశాలలుగా కొనసాగిస్తామని ఇచ్చిన హామీని గుర్తు చేసుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చాక పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి వైద్య కళాశాలలను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. దీనివల్ల నష్టపోయేది విద్యార్థులు మాత్రమే కాదని, పేద వర్గాల ప్రజలు కూడా ఉచిత వైద్యానికి దూరమవుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వి.రాజు, ఏఐఎస్‌ఎఫ్ నియోజవర్గ నాయకులు లతా, సీత, నవ్య పాల్గొన్నారు.
ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ