
ఒకే రోజు అల్లుడు, మామ మృతి
మునగపాక: ఓ కుటుంబంపై విధి కన్నెర్ర చేసింది. ఒకే ఇంట్లో ఒకే రోజు అల్లుడు, మామ మృతితో తీవ్ర విషాదం నింపింది. సోమవారం అనారోగ్యంతో చనిపోయిన తన మామ అంత్యక్రియలకు అవసరమైన కట్టెలు తెచ్చేందుకు పొలానికి వెళ్లిన అల్లుడు విద్యుత్ షాక్‌కు గురై మృత్యువాతకు గురైన ఘటన నారాయుడుపాలెంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నారాయుడుపాలెం గ్రామానికి చెందిన కొయ్య మీసాల అప్పారావు(64) అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందారు. కుటుంబ సభ్యులు అతని అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా అప్పారావు అల్లుడు ప్రసాదుల సన్యాసిరావు(54) అవసరమైన కట్టెలను తెచ్చేందుకు మధ్యాహ్నం స్థానికులతో కలిసి పొలానికి వెళ్లాడు. పొలంలో తెగిపడి ఉన్న విద్యుత్ వైర్లు ఆయన కాలికి తగలడంతో సన్యాసిరావు అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ఆయన విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. మృతుడికి భార్య వెంకటలక్ష్మి. ఇద్దరు పిల్లలు ఉన్నారు. మునగపాక ఎస్‌ఐ పి.ప్రసాదరావు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ శాఖ ఏఈ శరగడం జగదీష్.. నారాయుడుపాలెంలో సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు.

ఒకే రోజు అల్లుడు, మామ మృతి