ఎడాపెడా ట్రాఫిక్‌ చలానాలు | - | Sakshi
Sakshi News home page

ఎడాపెడా ట్రాఫిక్‌ చలానాలు

Sep 8 2025 5:46 AM | Updated on Sep 8 2025 5:46 AM

ఎడాపె

ఎడాపెడా ట్రాఫిక్‌ చలానాలు

● మోటార్‌ వాహన చట్ట కొత్త నిబంధనలతో భారీ జరిమానాలు ● వాహన దారుల బెంబేలు

మునగపాక: ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వాహనదారులపై పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. గతంలో కన్నా పెద్ద మొత్తంలో జరిమానాలు విధించడంతో వాహన దారులు బెంబేలెత్తుతున్నారు. ఎడాపెడా ట్రాఫిక్‌ చలానాలు వేసేయడంతో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న చర్యలపై పెదవి విరుస్తున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారితో పాటు కూలీ పనులు చేసుకునే వారిపై పెనుభారం మోపుతున్నారంటూ వాపోతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చట్టాలు అందుబాటులోకి తీసుకురావడం తప్పులేదంటూనే జరిమానాలు భారీగా విధించడం పట్ల ప్రయాణాలు చేసే వారు విమర్శలు గుప్పిస్తున్నారు.

తరుచూ వాహన తనిఖీలు

వాహన నియమాలు పాటించని వాహనదారులపై పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. ప్రతిరోజూ మండల కేంద్రంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. పూడిమడక రోడ్డులో రాకపోకలు సాగించే వాహనాలను తనిఖీ చేయడంతో పాటు రికార్డులు పరిశీలిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడంతో పాటు ట్రాఫిక్‌ నియమాలు పాటించేలా అవగాహన కల్పిస్తున్నా కొంతమంది వాహన చోదకులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో పోలీసులు అటువంటి వారిపై జరిమానాలు విధిస్తున్నారు. అయితే మునుపెన్నడూ లేని విధంగా భారీ జరిమానాలు విధించడం పట్ల వాహనచోదకులు ఆవేదన చెందుతున్నారు.

ప్రమాదాల నివారణకు సహకరించాలి

ప్రతి వాహనదారు తప్పనిసరిగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి, రోడ్డు ప్రమా దాల నివారణకు అవగాహన కల్పిస్తున్నా కొంతమంది నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్నారు. ప్రతి వాహనదారు తప్పనిసరిగా రికార్డులు అందుబాటులో ఉంచుకోవాలి. మద్యం తాగి వాహనాలు నడిపినా చర్యలు తప్పవు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.

–పి.ప్రసాదరావు, ఎస్‌ఐ, మునగపాక

మోటార్‌ వాహన చట్టం ఈ ఏడాది మార్చి నుంచి కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం జరిమానాలు ఇలా....

హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపితే రూ.1000

సీటు బెల్ట్‌ లేకుండా కారు నడిపితే రూ.1000

సిగ్నల్‌ జంప్‌తో పాటు రాంగ్‌ రూట్‌లో ప్రయాణిస్తే రూ.1000

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడితే రూ.10వేలతో పాటు లైసెన్స్‌ రద్దు

సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తే తొలిసారిగా రూ.1000 , రెండో సారైతే రూ.10వేలు చెల్లించాలి.

ఇన్సూరెన్స్‌ లేకుండా వాహనం నడిపితే తొలిసారిగా రూ.2వేలు, రెండో సారైతే రూ.4 వేలు చెల్లించాలి.

డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపితే రూ.5వేలు జరిమానా

బైక్‌పై ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తే రూ.1000

యూనిఫాం లేకుండా ఆటో నడిపే డ్రైవర్‌కు రూ.300

ద్విచక్ర వాహనం వెనుక కూర్చొన్న వ్యక్తి కూడా హెల్మెట్‌ ధరించాలి. అలా లేకుంటే రూ.1000 జరిమానా చెల్లించాలి.

108 వాహనంతో పాటు అత్యవసర వాహనాలకు దారివ్వకుంటే రూ.10వేలు

ఎడాపెడా ట్రాఫిక్‌ చలానాలు 1
1/1

ఎడాపెడా ట్రాఫిక్‌ చలానాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement