
ఏఎంఏఎల్ కళాశాలకు పూర్వవైభవం రావాలి
అనకాపల్లి టౌన్: ఏఎంఎఎల్ కళాశాలకు పూర్వవైభవం తీసుకురావాలనని ఏఎంఏఎల్ కళాశాలలో 1973 నుంచి 2021 వరకు చదివిన పూర్వ విద్యార్థులంతా ఆకాంక్షించారు. కళాశాల సమీపంలో ఒక ప్రెవేట్ పంక్షన్ హాల్‌లో పూర్వవిద్యార్థుల సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదికవి నన్నయ్య మాజీ వైస్ చాన్సలర్ ముర్రు ముత్యాల నాయుడును ఘనంగా సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కళాశాలలకు మూల స్తంభాలు అని కొనియాడారు. ప్రభుత్వాలపై ఆధారపడకుండా ఉన్న ఈ కళాశాలలో చదువుకున్న వారు ప్రభుత్వ ఉద్యోగులుగా, వైద్యులుగా ఉన్నత స్థానాలలో స్ధిరపడ్డారని అటువంటి వారి కలయిక కళాశాల భవిష్యత్‌కు దోహదపడాలని సూచించారు. ఎమ్మెల్యే కొణతాల మాట్లాడుతూ ఇదే కళాశాలలో చదువుకున్న తాను కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో వర్తక సంఘం అధ్యక్షుడు టి.రఘుబాబు, కళాశాల అధ్యక్షుడు శ్రీదరాల కృష్ణ ప్రేరాజు, కరస్పాడెండ్ పెంటకోట శ్రీనివాసరావు, పూర్వ విద్యార్థులు వంకాయల శివ శంకర్ తదితరులు పాల్గొన్నారు.