
అచ్చెన్న చెరువును కాపాడండి
అచ్యుతాపురం రూరల్: అక్రమంగా తరలించుకుపోతున్న యర్రవరం గ్రామానికి చెందిన అచ్చెన్న చెరువును కాపాడాలని గ్రామస్తులు ఆందోళన చేశారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత గ్రామంలో ప్రభుత్వ సర్వె నెం.147లో 14 ఎకరాల అచ్చెన్న చెరువులో అక్రమంగా చొరబడి చెరువు మట్టిని తరలించుకుపోతున్న బారీ టిప్పర్ లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామానికి చెందిన సహజ సంపదను అక్రమంగా దోచుకుంటున్నారని ఆవేదన చెందారు. ఉపాధి హామీ పథకం పనులు చేసుకోవడానికి వీలు లేనంత విధంగా చెరువును నష్టపరుస్తున్నారన్నారు. రాత్రంతా నిధ్రపోకుండా గ్రామస్తులు ప్రభుత్వ చెరువు మట్టి తరలిపోకుండా అచ్యుతాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు లారీలను అచ్యుతాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపడతామని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సాక్షితో మాట్లాడారు. నాలుగు రోజుల నుండి తమ గ్రామానికి చెందిన చెరువు మట్టిని అక్రమంగా తరలించారన్నారు. చెరువుపై ఆధారపడి ఉన్న 200 ఎకరాల పల్లపు పంట పొలాలు నష్టానికి గురౌతాయన్నారు. సుమారు 200 కుటుంబాలు 300 మంది అచ్చెన్న చెరువులోనే ఉపాధి హామీ పనులు చేసి ప్రతి సంవత్సరం జీవనం సాగిస్తున్నారన్నారు. పరిశ్రమలకు, వ్యాపార సముదాయాలకు, లే–అవుట్‌లకు, ఇంటి నిర్మాణాల్లో, ఖాళీ స్థలాల్లో ఫిల్లింగ్ చేసుకోవడానికి అనుమతులు లేకపోయినా పగలు రాత్రి అన్న తేడా లేకుండా చెరువు మట్టిని అక్రమంగా తరలించడంపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.
మట్టిని తరలిస్తున్న లారీలను అడ్డుకున్న గ్రామస్తులు
మట్టి అక్రమ తవ్వకాలు అరికట్టాలి
గ్రామాల్లో కూటమి నాయకులు గ్రావెల్, మట్టి మాఫియాగా తయారయ్యారు. మండలంలో జరుగుతున్న అక్రమ గ్రావల్, మట్టి తవ్వకాలపై అధికారులు కూటమి నాయకులకు వత్తాసు పలుకుతూ ప్రభుత్వ సంపదను దోచి పెట్టడం సరికాదు. ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ వనరులను కాపాడాలి.
–కరణం ధర్మశ్రీ, వైఎస్‌ఆర్‌సీపీ యలమంచిలి సమన్వయకర్త

అచ్చెన్న చెరువును కాపాడండి

అచ్చెన్న చెరువును కాపాడండి