దేవరాపల్లి : మండలంలోని ఎం.అలమండ గ్రామానికి చెందిన బుడ్డ శ్రీను(28) పాము కాటుకు గురై మృతిచెందాడు. మృతుడు తండ్రి గోవింద తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్న శ్రీను శుక్రవారం రాత్రి స్నేహితులతో కలిసి బహిర్భూమికి వెళ్లగా ఎడమ కాలిపై విష సర్పం కాటు వేసింది. పాము కాటుకు గురైన శ్రీను కేకలు వేయడంతో వెంటనే అతడి స్నేహితులు స్పందించి ద్విచక్ర వాహనంపై కె.కోటపాడు సీహెచ్‌సీకి తరలించారు. కాగా అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి గోవింద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక ఎస్‌ఐ పి. సత్యనారాయణ శనివారం తెలిపారు. మృతుడికి తల్లిదండ్రులతో పాటు చెల్లెలు రమ్య ఉన్నారు.
ఒక్కగానొక్క కుమారుడు అర్ధంతరంగా మరణించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వర్షాకాలం కావడంలో పాము సంచరించే ప్రమాదం ఉన్నందున రాత్రి సమయాల్లో పొలాలు, బహిర్భూకి వెళ్లే సమయంలో టార్చి లైట్లు వెంట తీసుకువెళ్లాలని మండల ప్రజలకు ఎస్‌ఐ సత్యనారాయణ సూచించారు.