
ఆలయాలు మూసివేత
చంద్రగ్రహణం కారణంగా దర్శనాలు బంద్ సంప్రోక్షణ అనంతరం నేటి ఉదయం 9 గంటల తర్వాత పునరుద్ధరణ
సింహాచలం/నక్కపల్లి/నక్కపల్లి: సంపూర్ణ చంద్రగ్రహాణాన్ని పురస్కరించుకుని సింహాచలంతో సహా ఉమ్మడి విశాఖ జిల్లాలోని దేవాలయాలను ఆదివారం సాయంత్రం మూసివేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో సాయంత్రం ఆరాధనలు, నిత్య సేవాకాలం పూజలు నిర్వహించిన అనంతరం దర్శనాలను నిలిపివేసినట్టు ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్ తెలిపారు. సోమవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం 9 గంటల తర్వాత మళ్లీ దర్శనాలు ప్రారంభమవుతాయని తెలిపారు, గరుడాద్రిపై వెలసిన స్వామివారి మూలవిరాట్ ఉన్న ఆలయం, క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి సన్నిధి, ఆండాళ్లమ్మవారి సన్నిధి కోదండ రామాలయంతోపాటు ఉపాలయాలు, బంధుర సరస్సుకు అభిముఖంగా ఉన్న శ్రీ భువనేశ్వరి సమేత లక్ష్మణేశ్వర స్వామి ఆలయాలను మూసివేశారు. గ్రహణ మోక్షకాలం అనంతరం సోమవారం వేకువజామున సంప్రోక్షణ కార్యక్రమాలు మొదలవుతాయి. స్వామివారికి నిత్యపూజలు, కై ంకర్యాలు నిర్వహించిన తర్వాత భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. ఒడ్డిమెట్టలో కై లాసగిరిపై స్వయంభూగా వెలసిన లక్ష్మీగణపతి, నామవరంలోని స్వయంభూ రామలింగేశ్వరాలయం, కుర్తాళం పీఠాధిపతి ప్రతిష్టించిన నాడీ గణపతి ఆలయం, సీతమ్మవారి మెట్టపై ఉన్న ఉమా ధర్మలింగేశ్వరాలను కూడా మూసివేస్తున్నట్లు అర్చకులు తెలిపారు.
నిర్మానుష్యంగా సింహగిరి
సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆదివారం సింహగిరి నిర్మానుష్యంగా మారింది. సాధారణంగా ఆదివారం రోజున భక్తులతో రద్దీగా ఉండే సింహగిరి.. గ్రహణం ప్రభావంతో వెలవెలబోయింది. గ్రహణం దృష్ట్యా శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనాలను ఉదయం 11.30 గంటల వరకే కల్పించారు. మధ్యాహ్నం 2.25 గంటలకు ఆలయ కవాట బంధనం చేశారు. అర్చకులు ఆలయ భోగమండపం ద్వారం, రాజగోపురం తలుపులను మూసివేశారు. అంతకుముందు స్వామికి రాజభోగం, మధ్యాహ్నం నిర్వహించాల్సిన పవళింపుసేవ, పౌర్ణమి తిరువీధి, రాత్రి ఆరాధన, పవళింపు సేవలను వరసగా నిర్వహించారు. సంప్రోక్షణ అనంతరం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనాలు సోమవారం ఉదయం 8 గంటల నుంచి తిరిగి ప్రారంభమవుతాయి.

ఆలయాలు మూసివేత