
గంగపుత్రుల గోడు వినండి
రావికమతం: మత్స్యకార కుటుంబాలకు ప్రత్యేక సొసైటీని ఏర్పాటు చేసి జీవనోపాధిని కల్పించాలని కోరుతూ ఆదివారం నాయుడు చెరువులో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. కొత్తకోటలోని బేరా బాబూరావు, నూకరాజు, లక్ష్మణ్, మోరమెల్ల, ఇంటి నాగేశ్వరరావు కుటుంబాలకు చెందిన 18మంది మత్స్యకారులు రోలుగుంట మండలం కొమరవోలు స్వదేశీ మత్స్యకార సంఘంలో సభ్యులుగా కొనసాగుతున్నారు. గడిచిన ఐదేళ్లుగా సొసైటీ నడవట్లేదు. కల్యాణపులోవ జలాశయంలో చేపల వేట నిషేధంపై కోర్టులో కేసు నడుస్తోంది. చేపల వేట నిలిపివేయడంతో జీవనోపాధిని కోల్పోతున్నామని మత్స్యకారులు చెబుతున్నారు. కొత్తకోట పరిధిలో చేపల పెంపకానికి అనువైన చెరువులు ఉన్నాయి. చెరువులో చేపల పెంపకానికి స్థానిక గ్రామ పంచాయతీ పాలకులు అనుమతులు కల్పించాలని చెప్పారు. ప్రత్యేక మత్స్యకార సొసైటీని ఏర్పాటు చేయాలని గత రెండేళ్లుగా సంబంధిత అధికారులను కోరుతున్నా స్పందించడం లేదని, దీంతో తమ జీవనోపాధి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై 2024 ఫిబ్రవరి 12న, మార్చి11న స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు వినతి పత్రాలు ఇచ్చామన్నారు. దీనిపై అప్పటి జిల్లా కలెక్టర్ విచారణ చేసి ప్రత్యేక సొసైటీ ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటామని తెలిపారని, 2025 ఆగస్టు 11న పీజీఆర్‌ఎస్‌లో జిల్లా కలెక్టర్‌కు మరోమారు వినతి పత్రం ఇచ్చామని, సొసైటీ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు మత్స్యశాఖ అధికారి జి.విజయ సమాచారం ఇచ్చారని, కానీ స్పందన లేదని ఆరోపించారు. అధికారులు తక్షణం సొసైటీ ఏర్పాటు చేసి తమ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
చెరువులో మత్స్యకారుల అర్ధనగ్న ప్రదర్శన