జైలు అధికారుల నిర్లక్ష్యం వల్లే.. | - | Sakshi
Sakshi News home page

జైలు అధికారుల నిర్లక్ష్యం వల్లే..

Sep 8 2025 5:46 AM | Updated on Sep 8 2025 5:46 AM

జైలు అధికారుల నిర్లక్ష్యం వల్లే..

జైలు అధికారుల నిర్లక్ష్యం వల్లే..

సులువుగా తప్పించుకున్న రిమాండ్‌ ఖైదీలు

మరింత దూరం పారిపోయేందుకు ప్రణాళిక

సీసీ ఫుటేజి ఆధారంతో విశాఖలో పట్టుకున్న పోలీసులు

వివరాలు వెల్లడించిన ఎస్పీ తుహిన్‌ సిన్హా

అనకాపల్లి టౌన్‌: చోడవరం సబ్‌ జైలులో డ్యూటీలో ఉన్న అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రిమాండ్‌ ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నారని ఎస్పీ తుహిన్‌ సిన్హా తెలిపారు. ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలు.. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం టోకూరు పంచాయతీ కార్యదర్శి నక్కా రవికుమార్‌ (30), అనకాపల్లి జిల్లా మాడుగులలో ఓ చోరీ కేసులో నిందితుడైన బెజవాడ రాము (26) చోడవరం సబ్‌ జైల్‌లో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నారు. రవికుమార్‌, రాములకు బెయిల్‌ మంజూరైనప్పటికీ జామీను దొరకకపోవడం వల్ల జైలు నుంచి విడుదల కాలేదు. వీరిద్దరూ శారదా బ్యారక్‌లో ఉన్న మరో ఖైదీ ఏక స్వామితో సన్నిహితంగా మెలిగేవారు. ఆయన గతంలో హత్యాయత్నం తదితర కేసులలో నిందితుడు. ‘మీకు ఎప్పటికీ జామీను దొరకదు, పది సంవత్సరాల జైలు శిక్ష తప్పద’ని భయపెట్టి జైలు నుంచి తప్పించుకోవాలని ప్రేరేపించాడు. జైలు సిబ్బంది వయసు మీరినవారని, అనారోగ్యంతో బాధపడుతున్నారని, వారిలో కేవలం కానిస్టేబుల్‌ నానాజీ మాత్రమే అప్రమత్తంగా ఉంటాడని చెప్పి, నానాజీ లేని సమయంలో తప్పించుకోవాలని సూచించాడు. హెడ్‌ వార్డర్‌ వీర్రాజు రికార్డులు రాయడంలో, వంటగది పనుల్లో రవికుమార్‌ను ఉపయోగించుకునేవారు. బ్యారక్‌ గేటు తాళం వేయకుండా ఆయన నిర్లక్ష్యంగా ఉండడం నిందితులు గమనించారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వంటగదిలో ఇనుప సుత్తిని తీసుకొని, శుక్రవారం హెడ్‌ వార్డర్‌ వీర్రాజుపై దాడి చేశారు. ఇతర సిబ్బందిని గార్డు గదిలో బంధించి ఏఎస్‌ఐ కృష్ణమూర్తి దగ్గర ఉన్న ప్రధాన గేటు తాళాలు లాక్కొని తప్పించుకున్నారు. వీరు కొత్తూరు జంక్షన్‌, శివాలయం ఆర్చ్‌, పీఎస్‌ పేట మార్గంలో వెళ్లి బస్సులో విశాఖ చేరుకున్నారు. పోలీసులకు దొరక్కుండా మరింత దూరం పారిపోవాలని పథకం వేసుకున్నారు. అందుకు అవసరమైన సొమ్ము సంపాదించడానికి దొంగతనం చేయాలనుకున్నారు. రిమాండ్‌ ఖైదీలు తప్పించుకున్న వెంటనే అప్రమత్తమైన పోలీసు అధికారులు లుకౌట్‌ నోటీసులు జారీ చేసి వాట్సప్‌ గ్రూప్‌లు, పత్రికల ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. సీసీ ఫుటేజి సహాయంతో వారు విశాఖ వచ్చినట్లు గుర్తించారు. విశాఖ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్లు, అనకాపల్లి జిల్లా పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి విస్తృతంగా గాలించి, శనివారం రామ్‌నగర్‌ గొల్లలపాలెం ఎస్‌బీఐ బ్యాంక్‌ సమీపంలో ఖైదీలు రవికుమార్‌, రాములను పట్టుకున్నారు. జామీను భారం తగ్గించమని న్యాయస్థానాన్ని కోరేందుకు డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సహాయం కోసం తాను పెట్టుకున్న అర్జీని హెడ్‌ వార్డర్‌ వీర్రాజు తొక్కి పెట్టారని, ఆ కోపంతో తాను ఆయనపై సుత్తితో దాడి చేశానని నిందితుడు రవికుమార్‌ వెల్లడించినట్టు ఎస్పీ చెప్పారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎం.శ్రావణి, చోడవరం ఎస్‌ఐ బి.కార్తీక్‌, జిల్లా సబ్‌ జైల్‌ ఇన్‌చార్జ్‌ ఆఫీసర్‌ డి.రాజు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement