
అందరికీ యూరియా అందేలా చర్యలు
కలెక్టర్ విజయ కృష్ణన్
కశింకోట: అర్హులైన రైతులందరికీ యూరియా అందేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ విజయ కృష్ణన్ చెప్పారు. వెదురుపర్తి గ్రామంలో ఆదివారం పర్యటించి అక్కడి రైతు సేవా కేంద్రంలో రైతులతో సమావేశమయ్యారు. ఎరువుల పంపిణీ జరుగుతున్న తీరును, వాటిలో ఎదురయ్యే ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 1500 మెట్రిక్ టన్నుల యూరియా ఎరువు నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలో యూరియా లభ్యత కోసం ప్రతి గ్రామంలో తహసీల్దార్, ఎంపీడీవో, వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో మూడు వేర్వేరు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మోతాదుకు మించి ఎరువులు వినియోగిస్తే దోమపోటు, పొడ తెగులు వంటి చీడ పీడల తాకిడి పెరిగే అవకాశం ఉందన్నారు. దీని దృష్ట్యా అధికారులు సూచించిన మేరకు యూరియా వినియోగించాలన్నారు. ఎవరైనా అధిక ధరలకు యూరియా విక్రయిస్తే సమీపంలోని మండల వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేయాలన్నారు. ఆర్డీవో షేక్ ఆయిషా, జిల్లా వ్యవసాయాధికారి బి.మోహనరావు, మండల ప్రత్యేక అధికారి సుభాషిణి, తహసీల్దార్ సీహెచ్.తిరుమలరావు, ఎంపీడీవో ధర్మారావు, మండల వ్యవసాయ అధికారి ఎం.స్వప్న పాల్గొన్నారు.