తిరగని బస్సు.. ప్రయాణికులు కస్సుబుస్సు | - | Sakshi
Sakshi News home page

తిరగని బస్సు.. ప్రయాణికులు కస్సుబుస్సు

Sep 8 2025 5:46 AM | Updated on Sep 8 2025 5:46 AM

తిరగన

తిరగని బస్సు.. ప్రయాణికులు కస్సుబుస్సు

కృష్ణారాయుడుపేట వద్ద 2 నెలల క్రితం కుంగిన కల్వర్టు

దేవరాపల్లి నుంచి కొత్తవలస మీదుగా రాకపోకలు బంద్‌

మూడు జిల్లాల ఆర్టీసీ ప్రయాణికులకు అవస్థలు

విశాఖ నుంచి కృష్ణారాయుడిపేట వరకే కొన్ని 12 డి బస్సు సర్వీసులు

దేవరాపల్లి, ఆనందపురం నుంచి ఆటోల్లో చేరుకోవాల్సిన దుస్థితి

అసలే అరకొరగా సర్వీసులు.. ఆపై సమయానికి రాని పరిస్థితి

సమస్య ఇది....

దేవరాపల్లి నుంచి కొత్తవలస మీదుగా విశాఖపట్నం వెళ్లే మార్గంలో కృష్ణారాయుడుపేట సమీపంలో కల్వర్టు కుంగిపోవడంతో ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మార్గంలో నడిచే 12 డీ, 68 డీ ఆర్టీసీ బస్సు సర్వీసులను జూలై 21 నుంచి ఆర్టీసీ అధికారులు నిలిపివేశారు. సుమారు రెండు నెలలు కావస్తున్నా కుంగిన కల్వర్టుకు మరమ్మతులు లేదా పునఃనిర్మాణ పనులు చేపట్టలేదు. దీంతో నిత్యం పదుల సంఖ్యలో బస్సులు, అధిక సంఖ్యలో ప్రయాణికులతో కళకళలాడే దేవరాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణ కళాహీనంగా మారింది.

దేవరాపల్లి: ఆర్టీసీ ప్రయాణికుల బస్సు కష్టాలను తీర్చడంలో కూటమి ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్వర్టు కుంగిన కారణంగా బస్సు సర్వీసులను నిలిపివేసి సుమారు రెండు నెలలు కావస్తున్నా సమస్యకు పరిష్కార మార్గం చూపకపోవడంతో తీవ్రంగా మండిపడుతున్నారు. వెరసి అనకాపల్లి, అల్లూరి, విజయనగరం జిల్లాలకు చెందిన వందలాదిమంది ప్రయాణికులు, ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు నరకయాతన అనుభవిస్తున్నారు. సీ్త్రశక్తి పథకం పేరుతో హడావుడి చేసిన ప్రభుత్వం బస్సులను పునరుద్ధరించడంపై దృష్టి సారించకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అరకొర బస్సులతో మహిళలు సైతం నానా ప్రయాస పడుతున్నారు.

కృష్ణారాయుడుపేట వరకే 12 డి బస్సులు

విశాఖ నుంచి వచ్చే కొన్ని 12 డి బస్సులను కృష్ణారాయుడుపేట సమీపంలో కుంగిన కల్వర్టు వరకు మాత్రమే నడిపిస్తున్నారు. దీంతో కొత్తవలస వైపు వెళ్లే ప్రయాణికులు దేవరాపల్లి నుంచి కృష్ణారాయుడుపేట వరకు ఆటోల్లో చేరుకోవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. అలాగే విశాఖపట్నం నుంచి ఆనందపురం, దేవరాపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు కృష్ణారాయుడుపేట వరకు బస్సులో వచ్చి అక్కడి నుంచి ఆటోల్లో రాకపోకలు సాగిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు వాహనాదారులు అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్నట్లు పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రత్యామ్నాయంగా కొన్ని 12 డి బస్‌ సర్వీసులను రూట్‌ మళ్లించి ఆనందపురం, కె.కోటపాడు, పినగాడి, పెందుర్తి మీదుగా విశాఖపట్నానికి నడుతున్నప్పటికీ ప్రయాణ సమయం అధికమవ్వడంతో ప్రయాణికులు, ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ బస్సులైనా సమయానికి రాకపోవడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. గతంలో ప్రతి 15 నిముషాలకు 12 డి బస్సు సమయానికి రాకపోకలు సాగించి ఆర్టీసీకి అధిక ఆదాయాన్ని చేకూర్చేది. ప్రస్తుతం అసలే అరకొరగా బస్సులు నడుస్తుండగా అవి కూడా ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయ పరిస్థితి దాపరించింది. సాయంత్రం ఏడు దాటితే బస్సులు రావడం గగనంగా ఉంది. దీంతో ప్రయాణికులు, ఉద్యోగులు, దేవరాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. కల్వర్టు నిర్మాణానికి జీవీఎంసీ నుంచి రూ. 90 లక్షలు నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే ప్రకటించి రెండు నెలలు కావస్తున్నా నేటికీ పనులు కార్యరూపం దాల్చలేదు.

చిత్తశుద్ధి లేని ప్రభుత్వం

సీ్త్రశక్తి పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా బస్సులు నడపకపోవడంతో ఈ ప్రాంత మహిళలం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి కల్వర్టును నిర్మించడంతోపాటు గతంలో మాదిరిగా కొత్తవలస మీదుగా యథావిధిగా బస్సులు నడిపి ప్రజల ప్రయాణ కష్టాలు తీర్చాలి.

–గొర్రుపోటు రమాదేవి, మహిళ, దేవరాపల్లి

కల్వర్టు కుంగి రెండు నెలలైనా..

కృష్ణారాయుడుపేట సమీపంలో కూలిన కల్వర్టును తక్షణమే పునఃనిర్మించాలి. ప్రస్తుతం అరకొరగా బస్సులు నడుపుతున్నా అవి కూడా సకాలంలో రాక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారిలో కల్వర్టు కుంగి సుమారు రెండు నెలలు కావస్తున్నా పట్టించుకోక పోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.

–డి.వెంకన్న, సీపీఎం నేత, దేవరాపల్లి

తిరగని బస్సు.. ప్రయాణికులు కస్సుబుస్సు 1
1/3

తిరగని బస్సు.. ప్రయాణికులు కస్సుబుస్సు

తిరగని బస్సు.. ప్రయాణికులు కస్సుబుస్సు 2
2/3

తిరగని బస్సు.. ప్రయాణికులు కస్సుబుస్సు

తిరగని బస్సు.. ప్రయాణికులు కస్సుబుస్సు 3
3/3

తిరగని బస్సు.. ప్రయాణికులు కస్సుబుస్సు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement