
కష్టజీవుల పక్షాన ‘అన్నదాత పోరు’
రేపు వినతి పత్రం అందించేందుకు రైతులు తరలిరావాలి
ఉదయం 9.30 గంటలకు అనకాపల్లి చేరుకోవాలి
మాజీ డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు సూచన
తారువలో అన్నదాత పోరు పోస్టర్ ఆవిష్కరణ
దేవరాపల్లి: యూరియా సహా రైతులకు అవసరమైన ఎరువులను అందజేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో అనకాపల్లిలో మంగళవారం చేపట్టనున్న ‘అన్నదాత పోరు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు కోరారు. యూరియా కొరతతో అన్నదాతలు పడుతున్న ఇబ్బందులపై మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. తారువలో ఆదివారం నియోజకవర్గ స్థాయిలో ‘అన్నదాత పోరు’ పోస్టర్‌ను పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. మాడుగుల నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల నుంచి రైతులు అనకాపల్లి రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయం వద్దకు మంగళవారం ఉదయం 9.30 గంటలకు చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అక్కడి నుంచి ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకొని, రెవెన్యూ డివిజనల్ అధికారికి వినతి పత్రం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి, జెడ్పీటీసీ కర్రి సత్యం, వైస్ ఎంపీపీ పంచాడ సింహాచలంనాయుడు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు బూరె బాబూరావు, మండల యువజన అధ్యక్షుడు కర్రి సూరినాయుడు, సర్పంచ్‌లు నాగిరెడ్డి శఠారినాయుడు, దాసరి సంతోష్‌కుమార్, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.