
భవిష్యత్ పోరాటాలకు కార్మికులు సిద్ధం కావాలి
సీఐటీయు రాష్ట ప్రధాన కార్యదర్శి నరసింహారావు పిలుపు
చోడవరంలో సీఐటీయూ జిల్లా మహాసభలు ప్రారంభం
గోవాడ సుగర్స్ ఆధునికీకరణ, బకాయిలు విడుదల కోరుతూ తీర్మానం
చోడవరం: సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా సీఐటీయూ పోరాటం చేస్తోందని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నరసింహారావు పేర్కొన్నారు. స్థానిక గంగా ఫంక్షన్ హాలులో శనివారం జిల్లా మహాసభలను ఆయన ప్రారంభించారు. అనంతరం పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై భవిష్యత్తు పోరాటాలకు కార్మికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్మికులపై మోదీ ప్రభుత్వ దాడిని తిప్పి కొట్టడాన్ని కార్మిక వర్గం మరింత చైతన్యవంతంగా ముందుకు సాగాలన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ రక్షణ కోసం కార్మికులు చేస్తున్న పోరాటాన్ని ఆయన కొనియాడారు. జిల్లాలో కనీస వేతనాలు, కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత లేదన్నారు. వలస కార్మిక చట్టం కోసం సీఐటీయూ కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పీ–4 పేరుతో పేదలను బంగారు కుటుంబాలు చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
●గోవాడ సుగర్ ఫ్యాక్టరీని ఆధునికీకరించి, కార్మికులు, రైతులకు బకాయిలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గూనురు వరలక్ష్మి సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టారు. సహకార రంగంలో నడుస్తున్న ఏకై క సుగర్ ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకపోతే ఈ ప్రాంత రైతుల భవిష్యత్ అంధకారమవుతుందన్నారు. ప్రభుత్వం రూ.100 కోట్లు గ్రాంటుగా అందజేసి, ఆధునికీకరించి, రైతులు, కార్మికులకు రూ.30 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని సభలో ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఈ మహాసభల్లో అధ్యక్ష వర్గంగా కె.లోకనాథం, గూనురు వరలక్ష్మి, వి.వి.శ్రీనివాసరావు, దుర్గారాణి వ్యవహరించగా, సీఐటీయూ నాయకులు సత్తిబాబు, మళ్ల సత్యనారాయణ, ఎ.బాలకృష్ణ, జయలక్ష్మితో పాటు సీతారామ్ ఏచూరి, అచ్యుతానంద్‌తో పాటు ఇటీవల మృతి చెందిన కార్మిక నాయకులకు శ్రద్ధాంజలి ఘటించారు. యూనియన్ నాయకులు ఆర్.రాము, గనిశెట్టి సత్యనారాయణ, నాగశేషు, రుపాదేవి, సత్యవతి, త్రినాథు, నాగిరెడ్డి సత్యనారాయణ, ఎస్‌వీ నాయుడు, చంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.