
మరోసారి బయటపడ్డ టీడీపీ వర్గ విబేధాలు
రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్
తాతయ్యబాబుకు అవమానం
ఆయన రాక ముందే వడ్డాది, పేట డైవర్షన్ రోడ్ల మరమ్మతులకు
ఎమ్మెల్యే శంకుస్థాపన
బుచ్చెయ్యపేట: మండలంలో టీడీపీ వర్గ విబేధాలు మరోసారి బయట పడ్డాయి. భీమునిపట్నం, నర్సీపట్నం(బీఎన్) రోడ్డులో వడ్డాది పెద్దేరు నదిపైన, విజయరామరాజుపేట తాచేరు నదిపై కొట్టుకుపోయిన డైవర్షన్ రోడ్డు మరమ్మతు పనుల శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల తాతయ్యబాబుకు తీవ్ర అవమానం జరిగింది. ఆయన రాక ముందే ఎమ్మెల్యే రాజు ఆయా పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల తాతయ్యబాబు సొంత గ్రామమైన వడ్డాదిలో డైవర్షన్ రోడ్డుకు ముందుగా శంకుస్థాపన చేశారు. అయితే ఆయన రాక ముందు ఎమ్మెల్యే రాజు టీడీపీ నాయకులతో కలిసి భూమి చేశారు. తరవాత వచ్చిన తాతయ్యబాబు కొబ్బరికాయ కొట్టారు. ఇద్దరూ కనీసం పలకరించుకోలేదు. విలేకరులతో మాట్లాడిన వెంటనే ఎమ్మెల్యే వెళ్లిపోయారు. అప్పుడూ కూడా పలకరించలేదు. గత ఏడాదిన్నరగా ఎమ్మెల్యే రాజు, రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల మధ్య వర్గ విబేధాలు కొనసాగుతున్నాయి. టీడీపీలో రెండు గ్రూపులుగా విడిపోయారు. ఇప్పటికే వడ్డాదిలో తాతయ్యబాబు వెనకాల ఉన్న నాయకులందరిని ఎమ్మెల్యే రాజు తనవైపు లాక్కోని తాతయ్యబాబును ఒంటరి చేయాలని పావులు కదుపుతున్నట్లు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఇటీవల తాతయ్యబాబు కుమారుడి నిశ్చితార్థానికి వెళ్లిన కొంత మంది టీడీపీ నాయకులకు ఎమ్మెల్యే రాజు స్వయంగా ఫోన్ చేసి ఎందుకు వెళ్లినట్టు నిలదీసినట్టు సమాచారం. దీంతో ఎమ్మెల్యే రాజు, తాతయ్యబాబుల మధ్య విబేధాలు ఏ స్థాయికి చేరాయో తెలుస్తుందని పలువురు టీడీపీ, కూటమి నేతలే చర్చించుకుంటున్నారు. ఈ శంకుస్థాపన విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ జరుగుతుందని కొంత మంది కూటమి నేతలు భావించారు. అయితే ఇప్పటికే వడ్డాది, విజయరామరాజుపేట వంతెనలు, డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయి ప్రజలు ఆగ్రహాంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో టీడీపీలో ఘర్షణలు పడితే ప్రజలు ఛీ కొడతారని ఇరువర్గాలవారు చల్లన జారుకున్నారు. వడ్డాది డైవర్షన్ రోడ్డు పనులకు రూ.8 లక్షలు, విజయరామరాజుపేట డైవర్షన్ రోడ్డు పనులకు రూ.18 లక్షలు మంజూరయ్యాయి.