
విశాఖ టు అమరావతి ఆటోడ్రైవర్ పాదయాత్ర
నక్కపల్లి : ఆటోడ్రైవర్ల ఉపాధిని దెబ్బతీస్తున్న ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయాలంటూ విశాఖపట్నానికి చెందిన ఆటో డ్రైవర్ చింతకాయల శ్రీను విశాఖపట్నం నుంచి అమరావతికి పాదయాత్ర చేపట్టాడు. శనివారం నక్కపల్లి చేరుకున్న శ్రీనుకు ఆటో డ్రైవర్లు స్వాగతం పలికారు. అతనితో పాటు, కొద్ది దూరం పాదయాత్ర చేశారు. ఈ సందర్బంగా శ్రీను మాట్లాడుతూ ఎన్నో కష్టాలు వ్యయప్రయాసలు పడుతూ ప్రాణాలను ఆటోడ్రైవర్లు తమ కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. సరైన ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న తమపై మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. దీంతో మహిళలెవరూ ఆటోలో ప్రయాణించకపోవడం వల్ల పూర్తిగా ఆదాయం కోల్పోయి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి ఈ పథకానికి ప్రత్యామ్నాయం అలోచించి ఆటోడ్రైవర్ల ఉపాధి దెబ్బతినకుండా చూడాలని, డ్రైవర్లను ఆదుకోవాలని కోరుతున్నాను. ఆటోడ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో విశాఖపట్నం నుంచి అమరావతి వరకు పాదయాత్ర చేస్తున్నానన్నాడు.
అడ్డురోడ్డు చేరుకున్న పాదయాత్ర
ఎస్.రాయవరం: మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్ చింతకాయల శ్రీను తలపెట్టిన పాదయాత్ర శనివారం ఉదయం అడ్డురోడ్డు చేరుకుంది. మండలంలో ఉన్న ఆటో యూనియన్ నాయకులు, ఆటో డ్రైవర్లు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శ్రీనుకు పండ్లు, పండ్ల రసాలు అందజేశారు. పలు ఆటో డ్రైవర్ల యూనియన్ నాయకులు ఆయనను సత్కరించి కొంత దూరం పాదయాత్ర చేసి సాగనంపారు. ఈ కార్యక్రమంలో అప్పారావు, సింహాచలం, రమణ, మోహన్, సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.