
కాల్వలోకి దూసుకెళ్లిన కారు
యలమంచిలి రూరల్ : పట్టణానికి సమీపంలో మర్రిబంద బీపీసీఎల్ పెట్రోల్ బంక్ ఎదురుగా 16వ నెంబరు జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు గాయపడ్డారు. విశాఖపట్నం కోరమాండల్ ఫెర్టిలైజర్స్‌లో పనిచేస్తున్న ఆర్.వంశీ భార్య సునీత, ఇద్దరు కుమారులతో విజయవాడ ఆటోనగర్‌లో మృతి చెందిన బంధువు కుటుంబీకులను పరామర్శించేందుకు విశాఖపట్నం నుంచి కారులో బయలుదేరారు. యలమంచిలి మండలం మర్రిబంద సమీపంలో పెట్రోల్ బంకు ఎదురుగా వచ్చేసరికి వీరు ప్రయాణిస్తున్న కారును ఒక ద్విచక్రవాహనాన్ని తప్పించడానికి అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో రోడ్డు పక్కగా ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. కారు దూసుకెళ్లిన ప్రాంతంలో ఒక కల్వర్టు కూడా ఉండడంతో కారు ముందుభాగం నుజ్జయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్ బ్యాగ్‌లు తెరుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే కారు ఎడమవైపు భాగం దెబ్బతినడంతో ముందు సీట్లో కూర్చున్న వంశీ భార్య సునీత తలకు తీవ్ర గాయమైంది. భర్త వంశీ స్వల్పంగా గాయపడ్డారు. వెనుక సీట్లో కూర్చున్న ఇద్దరు కుమారులు గౌతమ్, మోక్షిత్ సురక్షితంగా ఉన్నారని వంశీ సాక్షికి తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే 108 అంబులెన్సులో గాయపడిన భార్యాభర్తలిద్దర్నీ అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి అక్కడ్నుంచి విశాఖ రాంనర్ కేర్ ఆస్పత్రికి మెరుగైన చికిత్స నిమిత్తం తరలించామన్నారు.