
డిప్యూటీ సీఎం పవన్ మాటల్లో నిజాయితీ కరువు
దేవరాపల్లి: గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించి, గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపుతామని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ మాటల్లో నిజాయితీ కొరవడిందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న విమర్శించారు. ఈ మేరకు దేవరాపల్లిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక గిరిజన గ్రామాల్లో చేపట్టిన రోడ్డు పనులకు బిల్లులు ఇవ్వక పోగా, కొత్తగా రోడ్లు మంజూరు చేయలేదన్నారు. దేవరాపల్లి మండలంలో చింతలపూడి పంచాయతీ శివారు బోడిగరువు, నేరెళ్లపూడి రహదారి వర్షాలకు కొట్టుకుపోవడంతో గిరిజనుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. వి.మాడుగుల మండలం అజయపురం గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ కూలి పనికి వెళ్లి కట్టెల వంతెన దాటబోయి కాలు జారి గెడ్డలో పడి చనిపోయిందన్నారు. అజేయపురానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని స్థానిక గిరిజనులు పలుమార్లు మొర పెట్టుకున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆదివాసీ మహిళ మచ్చమ్మ చనిపోయిందని, దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా పవన్‌కల్యాణ్ స్పందించి బోడిగరువు, నేరెళ్లపూడి, అజయపురంతో పాటు శంకరం పంచాయతీలోని ఏడు గ్రామాలకు రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించాలని వెంకన్న కోరారు.