
క్రైస్తవులను మోసగించిన కూటమి ప్రభుత్వం
మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లవరపు జాన్‌వెస్లీ
అనకాపల్లి : రాష్ట్రంలో క్రిస్టియన్ మైనార్టీ సెల్‌ని నేటి వరకూ ఏప్రభుత్వం ఏర్పాటు చేయలేదని, వైఎస్సార్‌సీపీ పాలనలో ఏర్పాటు చేయడంతో కూటమి ప్రభుత్వం కూడా అమలు చేస్తుందని వైఎస్సార్‌సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లవరపు జాన్‌వెస్లీ అన్నారు. స్థానిక రింగ్‌రోడ్డు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు పీఎస్‌ఎస్ జోసఫ్ అధ్యక్షతన శనివారం రాత్రి జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ జిల్లాలో 29 అనుబంధ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీనిలో క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఒక విభాగమన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కమిటీలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అబద్దపు హామీలతో గద్దెనెక్కి క్రైస్తవులను మోసం చేసిందన్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రశ్నించే గొంతులను అణచి వేయాలని చూస్తే కూటమి ప్రభుత్వానికి అంతం తప్పదని ఆయన జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ సెల్ అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం అధ్యక్షులు సన్నీజేమ్స్, తిమోతి నాయుడు, బేతిరెడ్డి విజయ్ కుమార్, సువార్త రాజు, పడాల గంగరాజు, జిల్లాలో పాస్లర్లు పాల్గొన్నారు.