
ఓనం.. సుమధురం
దేవరాపల్లి : మండలంలోని కై రళి హైస్కూల్‌లో ఓనం పండగను సంప్రదాయబద్ధంగా శనివారం నిర్వహించారు. స్కూల్ కరస్పాండెంట్ ఎంకె.దినేష్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మండల విద్యాశాఖ అధికారి సిహెచ్.ఉమ, ఎస్‌ఐ వి.సత్యనారాయణ ముఖ్యఅథితులుగా పాల్గొన్నారు. స్థానిక విద్యార్దులు, మహిళా ఉపాధ్యాయులు కేరళ సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. కేరళ సంస్కృతికి అద్దం పట్టే ఓనం పండుగను పురస్కరించుకొని విద్యాలయం ప్రాంగణంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన ముగ్గులు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్ధిని, విద్యార్దులు కేరళ సంప్రదాయ దుస్తులు ధరించి కేరళ గీతాలకు చేసిన నృత్య ప్రదర్శన అబ్బుర పరిచింది. విద్యార్థుల పులివేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.