
నిర్వీర్యం..
సచివాలయం..
సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం సాయశక్తులా కృషి చేస్తోంది. పొమ్మనకుండా పొగపెట్టే ప్లాన్లు వేస్తోంది. ఇప్పటికే వలంటీర్లను నిర్ధాక్షణ్యంగా ఆపేసిన ప్రభుత్వం.. ఇపుడు సచివాలయం ఉద్యోగులపై పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూనే వస్తుంది. రేషనలైజేషన్ పేరిట సచివాలయాలను కుదించింది. ఏడాదిలోనే సొంత మండలాల్లో ఉండకూడదని కొత్త నిబంధన తీసుకొచ్చి బదిలీలు చేసింది. ఇపుడు కొత్తగా వాట్సాప్ సర్వీస్ రిజిస్ట్రేషన్లను అదనంగా రుద్ది మరింత ఒత్తిడి పెంచింది. రిజిస్ట్రేషన్ విధులను సచివాలయ ఉద్యోగులు మూకుమ్మడిగా బహిష్కరించాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
సాక్షి, అనకాపల్లి :
సచివాలయ వ్యవస్థపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు సచివాలయ ఉద్యోగులకు శాపంగా పరిణమిస్తున్నాయి. ఈ ఉద్యోగుల విధులకు సంబంధించి నిర్దిష్టమైన విధానం లేకుండా ఎప్పటికప్పుడు తోచిన పనులు అప్పజెపుతుండడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఇంటింటికీ పెన్షన్ పేరుతో తిప్పుతున్న ఉద్యోగులను ఇకపై క్షేత్ర స్థాయి సర్వే వినియోగించాలని నిర్ణయించారు. ప్రభుత్వ పథకాలకు అర్హులను గుర్తించే బాధ్యతలను వీరికి అప్పగించారు. సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సర్వే చేపట్టాల్సి ఉంది. దీనిపై ఉద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
పథకాల లబ్ధిదారుల్లో కోత పెట్టాలని....
ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్లో కోత పెట్టాలని కూటమి ప్రభుత్వం గట్టి నిర్ణయంతో ఉంది. ఇప్పటికే దివ్యాంగుల పెన్షన్లపై పడింది. అనేక మంది దివ్యాంగుల పెన్షన్లలో కోత పెట్టింది. లేచి నిలబడలేని వారి పింఛన్లు సైతం తొలగించింది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ నెలకు మాత్రం పెన్షన్లకు తగ్గించకుండా యథావిధిగా నగదు జమ చేశారు. తర్వాత ఏం చేస్తారన్న టెన్షన్ దివ్యాంగుల్లో నెలకొంది. అలాగే మిగిలిన సంక్షేమ పథకాల లబ్ధిదారులను తగ్గించే ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం సచివాలయ ఉద్యోగుల ద్వారా పలు పథకాలు పొందుతున్న లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సర్వే చేయించాలని నిర్ణయించింది.
గూగుల్ మీట్‌లో రహస్య సమావేశం
గతంలో వలంటీర్లు ఒక క్లస్టర్‌కు పరిమితమై నిర్వహించిన విధులను సచివాలయ ఉద్యోగులకు ఒకటి కంటే ఎక్కువ క్లస్టర్లకు మ్యాప్ చేశారు. బలవంతంగా ఇంటింటికీ తిరిగే విధులు అప్పగిస్తున్నారు. ఇది ఇబ్బందికరంగా ఉందని పలువురు ఉద్యోగులు ఉన్నతాధికారులకు మోర పెట్టుకున్నారు. అయినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోయింది. తాజాగా శనివారం నుంచి వాట్సాప్ సర్వీస్‌కు సంభందించి అవగాహన.. ప్రతీ ఇంటికి బలవంతంగా సర్వీస్ నమోదు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై సచివాలయ ఉద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇష్టానుసారంగా పనులు అప్పగిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా రహస్యంగా ఆన్‌లైన్‌లో భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ గూగుల్ మీట్ ద్వారా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపుగా గంటన్నర పాటు పలు అంశాలపై చర్చించారు. ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ఏపీవీడబ్ల్యూ ఎస్‌ఈజేఏసీ ముందుకు వెళ్లాలని ఎకగ్రీవంగా తీర్మానించారు.
అలాగే వాట్సాప్ సర్వీస్ విధులను బహిష్కరించాలని నిర్ణయించినట్లు సమాచారం. సచివాలయ ఉద్యోగులు శనివారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. వాట్సాప్ సర్వీస్ రిజిస్ట్రేషన్ విధులు ముకుమ్మడిగా బహిష్కరించాలాంటూ నిర్ణయించుకున్నారు.
సచివాలయ ఉద్యోగులపై కూటమి కక్ష సర్వే పేరిట ఇబ్బందులకు గురి సంక్షేమ పథకాలను కోత పెట్టే బాధ్యతలు అప్పగింత ఇందుకోసం ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలని ఆదేశాలు తాజాగా వాట్సాప్ సర్వీసుల పేరుతో రోడ్లపై తిప్పాలని నిర్ణయం ప్రభుత్వ తీరుపై ఉద్యోగుల మండిపాటు ఐక్య వేదిక స్టీరింగ్ కమిటీ అత్యవసర సమావేశం వాట్సాప్ సర్వీస్ విధులను బహిష్కరించాలని నిర్ణయం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు