
దగా పడ్డ వైట్ బర్లీ రైతు
గొలుగొండ : వైట్ బర్లీ పొగాకు రైతులు దగా పడ్డారు. పంట కొనుగొళ్లు లేక నష్టపోయారు. మాట ఇచ్చిన కంపెణీలు మోసం చేశారు. ఇంటి వద్ద నిల్వ ఉంచిన పొగాకు చివరికి నాశనం కావడంతో లబోదిబో అంటున్నారు. పాలల్లో, షెడ్లల్లో దాచిన పొగాకు బేళ్లు ఎందుకు పనికిరాకుండా పోవడంతో పెట్టుబడులు నష్టపోయి కన్నీరుమున్నీరు అవుతున్నారు.
500 ఎకరాల్లో సాగు..
గొలుగొండ మండలంలో వైట్ బర్లీ పొగాకు సాగు చేసిన రైతులు దగా పడ్డారు. వీరితో పాటు అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలో రైతులు అయితే చెప్పనక్కలేదు. సుమారుగా గొలుగొండ, గొలుగొండ మండలాల్లో 500 ఎకరాల్లో వైట్ బర్లీ సాగు జరగడం జరిగింది. వేసవి పొగాకు సాగుతో ఎంఎల్, ఐటీసీ కంపీలు రైతులు ప్రోత్సాహం అందించి సాగు చేయించారు. జనవరి, ఫిబ్రవరి నెలలో సాగు చేసిన రైతులు చాలా వరకు నష్టపోయారు. ఈ రెండు మండలాల్లో సాగు చేసిన రైతులు కష్టపడి పెట్టుబడులు పెట్టి అధిక దిగుబడులు పొందారు. మేనెలలో ఈ రెండు కంపెనీలు కొనుగోళ్లు ప్రారంభించారు. కొయ్యూరు మండలంలో కంఠారం, గొలుగొండ మండలంలో చోద్యం వద్ద అరకొరగా కొనుగోళ్లు చేసి తూతూ మంత్రంగా చేతులు దులుపుకొన్నారు.
అరకొరగా కొనుగోళ్లు...
వేసవిలో సాగు చేస్తే మంచి ఆదాయం వస్తుందని కంపెణీ యాజమాన్యం పలు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించారు. కొయ్యూరు, గొలుగొండ మండలాల్లో నీటి వనరులు ఉన్న ప్రతి చోట ఈ సాగును రైతులు ప్రారంభించారు. వ్యవసాయ మోటార్లు, నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో సాగు మంచి దిగుబడులు సాధించారు. రైతులకు అవసరం అయిన ఎరువులు, నారును పై రెండు కంపెనీలు పోటాపోటీగా అందించారు. ఎకరానికి సుమారుగా రూ.50 వేల వరకు పెట్టుబడులు పెట్టి పంటను మంచిగా సాధించిన రైతులకు కంపెనీలు తీవ్ర దెబ్బ కొట్టాయి. ఎంఎల్, ఐటీసీ కంపెనీలు వారికి ఎంత కావాలో అంత కొనుగోళ్లు చేసి మిగతా పొగాను వదిలేశారు. రైతులు అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే బగాను బేళ్లు జాగ్రత్తగా దాచి ఉంచండి వెంటనే కొనుగోళ్లు చేస్తామని.. కల్లబొల్లి కబుర్లు చెప్పి తప్పించుకున్నారు. కొంత మంది రైతులు పొగాకు పంటను పొలాల్లోనే వదిలేసారు.
కొనుగోళ్లు చేస్తామని దగా...
ఎకరానికి రూ. 50 వేల వరకు పెట్టుబడులు పెట్టిన రైతులకు పంట నాశనం అవుతుంటుంటే ఏం చేయాలో అర్థం కాక లబోదిబో అంటున్నారు. మే, జూన్ వరకు పంటను కొనుగోళ్లు చేసిన కంపెనీలు త్వరలో రైతులు వద్ద ఉన్న పొగాకు కొనుగోళ్లు చేస్తామని ఉన్న పంటను జాగ్రత్తగా దాచి ఉంచాలని చెప్పి ఇప్పుడు జాడ లేకుండా పోయారు. దాచి ఉంచిన పొగాకు రంగు మారడం, ఉన్న బేళ్లు వద్ద పొగాకు తడిచిపోవడంతో పాటు ఎలకల వల్ల మరికొంత పంట నాశనమైంది. ఇలా ఈరెండు మండలాల్లో సుమారుగా రూ.రెండు కోట్ల వరకు విలువైన పంట ఉండిపోయిందని రైతులు చెబుతున్నారు. నీటి సదుపాయం ఉందని రైతులు ఒక్కొక్కరు రెండు నుంచి నాలుగు ఎకరాల వరకు సాగు చేయడం జరిగింది. నార్లు అందించిన కంపెనీలు చివరికి కనిపించకపోవడం చాలా బాధగా ఉందని రైతులు అంటున్నారు.
రూ.లక్షల్లో నష్టపోయాం
నేను రెండు ఎకరాల్లో వేసవిలో అనగా ఫిబ్రవరి నెలలో వైట్ బర్లీ సాగు చేశాను. నీటి సదుపాయం ఉండడం వల్ల పంటను బాగా పండించారు. మే నెలలో కొంతవరకు అమ్మకాలు చేయడం జరిగింది. నా చుట్టూ రైతులు నాతో పాటు కష్టపడి పండించారు. ఎంఎల్, ఐటీసీ కంపెనీలు పొగాకు నార్లుకు సరఫరా చేయడంతో అంతా ఉత్సాహంగా సాగు చేశాం. చివరికి కొంత పంట మాత్రమే కొనుగోళ్లు చేసి మిగతా పంటను జాగ్రత్తగా ఉంచాలని జులై నెలలోగా కొనుగోళ్లు చేస్తామని చెప్పారు. కానీ ఆగస్టు పూర్తయినా కొనుగోళ్లు చేయలేదు. దీనివల్ల ఇంటి వద్ద నిల్వ ఉంచి పొగాకు రంగు మారి, నాశనం అవుతోంది. దీంతో రూ.లక్షల్లో నష్టపోయాం.
–సుంకర శివ, లింగంపేట రైతు
రైతులు కొనుగొళ్లు లేక పంట పొలాల్లో వదిలేసిన దృశ్యం
కొనుగోళ్లు చేయకపోవడంతో నిల్వ ఉండిపోయిన వైట్ బర్లీ పొగాకు బేళ్లు

దగా పడ్డ వైట్ బర్లీ రైతు

దగా పడ్డ వైట్ బర్లీ రైతు

దగా పడ్డ వైట్ బర్లీ రైతు