
అనుమతుల్లేని ల్యాబ్‌లపై చర్యలు
బుచ్చెయ్యపేట : జిల్లాలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ల్యాబ్‌లను మూయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి హైమావతి హెచ్చరించారు. శనివారం ఆమె వడ్డాదిలో పలు ప్రైవేటు ల్యాబ్‌లను, ప్రభుత్వ ఆసుపత్రి, వసతి గృహాలు తనిఖీ చేశారు. వడ్డాదిలో ఉన్న పలు ప్రైవేటు ల్యాబ్‌ల వెళ్లి అక్కడ ల్యాబ్ టెక్నిషియన్లు చేస్తున్న టెస్టులను రికార్డులు తనిఖీ చేశారు. పదో తరగతి పాసై అనుభవం లేనివారు కూడా క్లినిక్‌లు ఏర్పాటు చేసి ల్యాబ్‌లు నిర్వహించడం, మిడిమిడి జ్ఞానంతో ఆర్‌ఎంపీ వైద్యులుగా, ల్యాబ్ టెక్నిషియన్లుగా చెలామణి అయిపోవడంపై ఆమె విస్తుపోయారు. అనుభవం లేకుండా క్లినిక్‌లు నిర్వహించడంపై ఆమె పలు క్లినిక్‌ల సిబ్బందిని హెచ్చరించారు. తక్షణం ల్యాబ్‌లు మూయకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. పలువురికి కొద్దిపాటి జ్వరం వచ్చినా అవసరం లేకున్న టెస్టులు చేసి వేలాది రూపాయలు వసూలు చేయడం, పేదవారి అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని వృత్తిని వ్యాపారంగా మార్చవద్దని పలువురిపై ఆగ్రహం చెందారు. వడ్డాదిలో ఒక క్లినిక్‌ను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆర్‌ఎంపీ వైద్యులతో మాట్లాడి వారు అందిస్తున్న సేవలు గురించి వాకబు చేశారు. వడ్డాదిలో వసతి గృహానికి వెళ్లి అక్కడ ఒక విద్యార్థి జ్వరంతో బాధపడగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందుతున్నట్లు తెలుసుకున్నారు. వడ్డాది ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసి రికార్డులు,ల్యాబ్ టెస్టులను పరిశీలించారు. వైద్యురాలు రమ్యదుర్గ, ఎంపీహెచ్‌వో మోజెస్,ల్యాబ్ టెక్నిషియన్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.