
9న కలెక్టరేట్ వద్ద ఆటో కార్మికుల ధర్నా
సమావేశంలో మాట్లాడుతున్న ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పెదిరెడ్ల నాగేశ్వరరావు
అనకాపల్లి : ఫ్రీ బస్‌ల వల్ల ఈనెల 15 నుంచి ఆటో కార్మికుల కుటుంబాలను రోడ్డున పాలు చేసిన కూటమి ప్రభుత్వానికి త్వరలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐటీయూసీ) జిల్లా అధ్యక్షుడు పెదిరెడ్ల నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 9వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నట్టు తెలిపారు. స్థానిక మెయిన్‌రోడ్డు ఫెడరేషన్ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆటో కార్మికులను కూటమి ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమైందని, ఫ్రీ బస్సు వల్ల ఆటో డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని, సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకాన్ని అమలు చేస్తామని ఇచ్చిన హామీ కోసం రెండు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నామని అన్నారు. ఆటో డ్రైవర్లకు ఆర్టీసీలో ఉపాధి అవకాశాలు కల్పించాలని, పీఎఫ్, ఈఎస్‌ఐతో కూడిన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, ఈనెల 15వ తేదీలోపు తమ సమస్యలు పరిష్కారం చేయకుంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా నాయకులు బాపునాయుడు, మార్కెండేయలు, నాగల వెంకటేశ్వరరావు, కూనపల్లి అప్పలరాజు, పొలమరశెట్టి అంజి, నూకరాజు వాయిబోయిన వెంకటేష్ పాల్గొన్నారు.