
ఉద్యోగులమా..వలంటీర్లమా?
● సచివాలయ ఉద్యోగుల నిరసన
మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న వార్డు సచివాలయ ఉద్యోగులు
యలమంచిలి రూరల్ : పట్టణంలో 10 వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. గతంలో వలంటీర్లు చేసే పనులన్నింటినీ మాతో చేయిస్తున్నారని మేము ఉద్యోగులో లేక వలంటీర్లో అర్థం కావడంలేదని వారంతా వాపోయారు.వలంటీర్ల మాదిరిగా క్లస్టర్లలో లబ్ధిదారుల మ్యాపింగ్ చేయాలని ఇచ్చిన సర్క్యులర్‌ను తామంతా వ్యతిరేకిస్తున్నట్టు వారంతా స్పష్టంచేశారు.రాష్ట్ర వార్డు,గ్రామ సచివాలయాల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు నిరసన చేపట్టామని తెలిపారు. ఇంటింటికీ తిరిగి వలంటీర్లలా అన్ని పనులు చేయాలని చూడడంతో తమ ఆత్మగౌరవం దెబ్బతింటోందని నిరసనలో పాల్గొన్న సచివాలయ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ బీజేఎస్ ప్రసాదరాజుకు వినతిపత్రం ఇచ్చారు. సచివాలయ ఉద్యోగుల నిరసనతో సచివాలయాల క్లస్టర్లలో హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ ప్రక్రియ నిలిచిపోయింది.