
దోపిడీ
గబ్బర్‌సింగ్ గ్రావెల్
ఆయన జనసేనలో చోటా మోటా నాయకుడు. తమ నాయకుడిపై వీరాభిమానంతో తన పేరుకు గబ్బర్‌సింగ్‌ను తోకగా తగిలించుకున్నాడు. ఈ ప్రాంతంలో ఆ పేరుతోనే సుపరిచితుడు. ఉప సర్పంచ్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతని అక్రమాలు తార స్థాయికి చేరాయి. నక్కపల్లి మండలంలో కంపెనీల కోసం ఏపీఐఐసీ వారు సేకరించిన భూముల్లో గ్రావెల్ తవ్వకాల్లో ఆరితేరిపోయాడు.
నక్కపల్లి: కొండలు, గుట్టలు కావేవీ అక్రమాలకు అనర్హం.. అన్న రీతిలో ఆ నాయకుడు వ్యవహరిస్తున్నాడు. బల్క్‌డ్రగ్ పార్క్ పనులు అతనికి వరంగా మారాయి. అధికారుల అండతో అందినంత కొల్లగొట్టేస్తున్నాడు. ప్రభుత్వం చందనాడ, అమలాపురం, వేంపాడు, డీఎల్ పురం, రాజయ్యపేట, బోయపాడు, మూలపర, పాటిమీద గ్రామాల్లో 4500 ఎకరాలను సేకరించింది. వీటిలో బల్క్‌డ్రగ్ పార్క్ కోసం 2 వేల ఎకరాలు, ఆర్సిలర్ మిట్టల్ స్టీల్‌ప్లాంట్ కోసం 2 వేల ఎకరాలు కేటాయించింది. బల్క్‌డ్రగ్ పార్క్‌కు ప్రభుత్వం ఇంటర్నల్ రోడ్డు, డ్రెయినేజీలు, కల్వర్టులు, మినీ బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్స్ వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. ఈ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. జాతీయ రహదారి నుంచి తమ్మయ్యపేట వరకు రూ.24 కోట్లతో 80 అడుగుల రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ పనులకు ఎస్‌ఆర్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ పనులకు గ్రావెల్ అవసరం ఉంది. ఏపీఐఐసీ పరిధిలో కొండలు, గ్రావెల్ పుష్కలంగా అందుబాటులో ఉంది. ఏపీఐఐసీ పరిధిలో ఉన్న ఒక గ్రామానికి ఉప సర్పంచ్‌గా వ్యవహరిస్తున్న ఈ గబ్బర్‌సింగ్ కూటమి ప్రభుత్వ పెద్దలతో తనకున్న పరిచయాలు, పరపతిని ఉపయోగించి ప్రభుత్వ భూముల్లో గ్రావెల్ తవ్వి ఎస్‌ఆర్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
నిబంధనలు బేఖాతర్
నిబంధనల ప్రకారం మైనింగ్ అధికారుల అనుమతితోనే గ్రావెల్ తవ్వకాలు జరపాల్సి ఉంటుంది. అయితే మౌలిక సదుపాయలు కల్పించే పనులకు గ్రావెల్ సరఫరా చేస్తున్నానంటూ గబ్బర్‌సింగ్ ఇక్కడ గ్రావెల్‌ను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నాడు. పొక్లెయిన్‌లతో తవ్వేసి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కంపెనీలకు ప్రతిరోజు వందలాది టిప్పర్లలో గ్రావెల్ సరఫరా చేస్తున్నాడు. ఏపీఐఐసీ ముసుగులో గ్రావెల్ అమ్మేసుకుంటున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకండా కూటమి ప్రభుత్వ అండదండలతో ఇతను చేస్తున్న అరాచకాలను అడ్డుకునే సాహసం ఏ అధికారి చేయడం లేదు. నిత్యం లక్షలాది రూపాయల ఆదాయం పొందుతున్న ఇతగాడు, తనకు వచ్చే ఆదాయంలో కొంత భాగం కూటమి ప్రభుత్వ పెద్దలకు కూడా సమర్పించుకుంటున్నాడు. ఇళ్ల నిర్మాణాలకు, సొంత అవసరాలకు ఎవరైనా ట్రాక్టర్ గ్రావెల్ పట్టుకెళ్తే దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్న పోలీసులు, రెవెన్యూ మైనింగ్ అధికారులు గబ్బర్ సింగ్ చేస్తున్న గ్రావెల్ దోపిడీ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని చుట్టుపక్కల గ్రామాల వారు ఆరోపిస్తున్నారు.
అధికారుల అండదండలు
గ్రావెల్ తవ్వకాలను అడ్డుకోవాల్సిన కొంతమంది అధికారులు సైతం అక్రమాల్లో భాగస్వాములవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. కీలక శాఖల్లో ఉన్నతాధికారిగా ఉన్న ఒక వ్యక్తి రెండు టిప్పర్లను ఈ గ్రావెల్ తరలింపు కోసం లీజు పద్ధతిలో ఎస్‌ఆర్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ వద్ద ఉంచినట్లు చెప్పుకుంటున్నారు. కూటమి నేతలు, కీలక ప్రభుత్వ శాఖల అండదండలతోనే గబ్బర్‌సింగ్ గ్రావెల్ దోపిడీ యథేచ్ఛగా జరుగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమలాపురం, మూలపర, డీఎల్ పురం కొండల నుంచి రేయింబవళ్లు యంత్రాలను ఏర్పాటు చేసి వేల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తవ్వేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. గతంలో పలు పర్యాయాలు కూటమి నేతల్లో వచ్చిన పంపకాల తేడా వల్ల ఒకరి వాహనాలను ఒకరు పట్టించుకుని కేసులు నమోదు చేయించుకోవడం, హోం మంత్రి వద్ద పంచాయతీ పెట్టడం జరిగింది. మనలో మనకు ఐక్యత లేకపోతే నష్టపోవాల్సి వస్తుందని ఒక అవగాహనకు వచ్చి ట్రిప్పుకు ఇంత అని బేరం కుదుర్చుకుని గ్రావెల్ అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు చేసుకోకుండా రాజీ పడ్డారని భోగట్టా. ఈ వ్యవహారంలో అధికారులకు సైతం మామూళ్లు భారీగానే అందుతున్నాయి. ఉచితంగా లభించే గ్రావెల్‌ను టిప్పర్ ధర రూ.10 వేలుగా నిర్ణయించి సమీపంలో ఉన్న కంపెనీలకు, ఎస్‌ఆర్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ వారికి విక్రయించి కోట్లు గడిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో గబ్బర్‌సింగ్ వేంపాడు రెవెన్యూలో క్షత్రియులకు చెందిన 7 ఎకరాల జిరాయితీ మిగులు భూమిని తన పలుకుబడిని ఉపయోగించుకుని రికార్డులు తారుమారు చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయించాడు. తర్వాత ఇదే భూమిని కొనుగోలు చేసి తన పేరున మార్చేసుకున్నాడు. ఏపీఐఐసీ నుంచి నష్టపరిహారం పొందేందుకు చేస్తున్న ప్రయత్నాలను తెలుసుకున్న అసలు హక్కుదార్లు లబోదిబోమంటూ కలెక్టర్, హోం మంత్రి, రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో పెండింగ్‌లో ఉంది.
ఏపీఐఐసీ భూముల్లో ఖనిజ సంపద లూటీ చేస్తున్న జనసేన నాయకుడు
కూటమి పెద్దల అండదండలతో కారిడార్ భూముల్లో తవ్వకాలు
పవన్ వీరాభిమానినంటూ గబ్బర్ సింగ్ పేరు
నిత్యం వందలాది లారీల్లో తరలింపు
రోజుకు లక్షల్లో అక్రమ సంపాదన

దోపిడీ

దోపిడీ