
భక్తి శ్రద్ధలతో మిలాద్–ఉన్–నబీ
కశింకోట ప్రధాన రహదారిలో ఈద్–మిలాద్–ఉన్–నబీ ర్యాలీ
కశింకోట: మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకొని మిలాద్–ఉన్–నబీ వేడుకను ముస్లింలు భక్తిశ్రద్ధలతో శుక్రవారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండలంలోని బయ్యవరంలోని హజ్రత్ అన్నర్ మద్‌నీ ఔలియా దర్గా నుంచి కశింకోట వరకు ముస్లింలు సంప్రదాయంగా జెండాలు చేతబూని ర్యాలీ నిర్వహించారు. స్థానిక నూరి మసీదులో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అనంతరం నూరి మసీదు కమిటీ అధ్యక్షుడు షేక్ రెహమాన్ (బాబర్), పలువురు మౌల్వీలు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధనలు మానవాళికి ఆచరణీయమన్నారు. ఆయన బోధించిన శాంతి, సహనం, ఐకమత్యం, సోదరభావం వంటివి ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు. మహమ్మద్ ప్రవక్త జీవనం మార్గదర్శకమన్నారు. ప్రవక్త వెలిగించిన జ్ఞాన జ్యోతి మానవ జాతికి ఒక దివ్య జ్యోతి అన్నారు. అంతా ఐక్యంగా మతసామరస్యంతో మెలిగి సకల జనుల సౌభాగ్యాన్ని కాంక్షించాలన్నారు. ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. నూర్ మసీదు కార్యదర్శి ఎస్.ఎం.ఎం. అలీ, కమిటీ ప్రతినిధులు అబ్దుల్ ఖలీమ్ అజాద్, మౌలానా నసీం అక్తర్, ఎం.ఎ.రబ్బానీ, నూర్ నభి, ముస్తఫా ఆలం, ఫజుల్ రెహమాన్, ఐ.ఎం. షరీఫ్, సయ్యద్ సలీం, అధికంగా ముస్లింలు పాల్గొన్నారు.