
దేవరాపల్లిలో యూరియా పంపిణీపై ఆరా తీసిన డీఏవో, ఆర్డీవో
దేవరాపల్లి: యూరియా కోసం రైతులు గంటల కొద్దీ నిరీక్షించి తీవ్ర ఇబ్బందులు పడ్డారని పత్రికల్లో వచ్చిన కథనాలపై జిల్లా కలెక్టర్ స్పందించారు. ఆమె ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయ అధికారి బి.మోహన్‌రావు, అనకాపల్లి ఆర్డీవో ఆయిషా దేవరాపల్లిలో గురువారం పర్యటించారు. దేవరాపల్లి రైతు సేవా కేంద్రంలో యూరియా పంపిణీపై స్థానిక వ్యవసాయ అధికారి, సిబ్బందిని ఆరా తీశారు. ఎరువుల పంపిణీకి సంబంధించిన రికార్డులను, స్టాక్ వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రావు మాట్లాడుతూ దేవరాపల్లి మండలంలో సుమారు 10 వేల ఎకరాల్లో ఖరీఫ్ వరి నాట్లు పూర్తయ్యాయని, ఇప్పటి వరకు 540 మెట్రిక్ టన్నులు యూరియా అందించామన్నారు. వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ అధికార్ల పర్యవేక్షణలో యూరియా పంపిణీ చేస్తామని, యూరియా స్టాక్ పాయింట్ వద్ద రెవెన్యూ సిబ్బందిని ఉంచుతామన్నారు. వీరి వెంట మండల ప్రత్యేక అధికారి ఎస్.మంజులవాణి, తహసీల్దార్ పి.లక్ష్మీదేవి, స్థానిక ఎస్‌ఐ వి.సత్యనారాయణ, మండల వ్యవసాయ అధికారి ఎల్.వై. కాంతమ్మ, ఏఈవో ఎస్.కిరణ్‌కుమార్ తదితర అధికార్లు, సిబ్బంది ఉన్నారు.