
చోడవరంలో వైభవంగా ముగిసిన నవరాత్రి ఉత్సవాలు
చోడవరం: స్వయంభూ పుణ్య క్షేత్రాల్లో కాణిపాకం తర్వాత ఒకటైన చోడవరం శ్రీస్వయంభూ విఘ్నేశ్వరస్వామి ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు సంబరంగా సాగాయి. గురువారం ముగింపు రోజున స్వామిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు. ఆలయంతో పాటు స్వామివారిని, గర్భగుడి ప్రాంగణాన్ని పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. వెండి, బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాల అలంకరణలో స్వామి కనువిందుగా దర్శనమిచ్చారు.
ఆలయ ప్రధానార్చకుడు కొడమంచిలి చలపతిరావు ఆధ్వర్యంలో వేద పండితులు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు చేశారు. అనంతరం పండిత ఆశీర్వచనం, లడ్డూ వేలం నిర్వహించారు. రాత్రి నిర్వహించిన స్వామివారికి తిరువీధోత్సవం కనుల పండువగా సాగింది. ప్రత్యేకంగా అలంకరించిన మూషిక వాహనంపై ఉత్సవ మూర్తులను ఉంచి ఊరేగించారు. ఎమ్మెల్యే రాజు, ట్రస్ట్ బోర్డు కమిటీ చైర్మన్ పసుమర్తి సాంబశివరావు, దేవదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్యనారాయణమూర్తి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.