
చదివిన చోటే బోధకుడిగా..
114 ఏళ్ల చరిత్ర కలిగిన పాఠశాల అభివృద్ధికి బాటలు
స్వచ్ఛంద సంస్థల సహకారంతో సేవా కార్యక్రమాలు
మాడుగుల మాస్టార్ నాగ వెంకట దేవి సూర్యనారాయణ ఆదర్శం
మాడుగుల మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాల
మాడుగుల రూరల్: ఉన్నత స్థాయిలో స్థిరపడిన తర్వాత మనం చదువుకున్న పాఠశాలలో అడుగుపెడితే ఒక్కసారిగా రెక్కలు వచ్చిన పక్షిలా బాల్య జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతాం. ఆనాటి అనుభూతులు ఎన్నెన్నో కళ్ల ముందు కదలాడుతుంటాయి. అప్పుడు పొందే ఆనందం వర్ణనాతీతం. ఇక్కడే ఉండిపోతే ఎంతో బాగుణ్ను అనిపిస్తుంది. అదే అక్కడే పనిచేసే అవకాశం లభిస్తే ఎగిరి గంతేస్తాం.. అటువంటి అరుదైన అవకాశం పొందిన మాడుగులకు చెందిన సిరిపిల్లి నాగ వెంకట దేవి సూర్యనారాయణ మాస్టారు తాను చదువుకున్న పాఠశాలలోనే ప్రధానోపాధ్యాయుడిగా అడుగుపెట్టారు. ఆయన 1998 డీఎస్సీలో ఎంపికై హుకుంపేట మండలం బంగారుమెట్టలో ఉపాధ్యాయ వృత్తి ప్రారంభించారు. ప్రస్తుతం మాడుగుల నడిబొడ్డున 114 సంవత్సరాలు చరిత్ర కలిగిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (గెడ్డబడి) విధులు నిర్వహిస్తున్నారు.
అభివృద్ధి బాటలో పాఠశాల
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (గెడ్డబడి )లో 2021 జనవరి 16న హెచ్‌ఎంగా చేరిన నాటికి ఇక్కడ 34 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేవారు. ఆయన కృషితో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 144కు పెరిగింది. ఐదుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఆయన చొరవతో పాఠశాలను వాసవీ క్లబ్ దత్తత తీసుకుంది. ఆరోహణ ట్రైబుల్ వెల్ఫేర్ సొసైటీ, మన్యం జ్యోతి సేవా సంఘం, భారత నిర్మాణ సేవా ట్రస్టు వంటి స్వచ్ఛంద సంస్థల సహకారంతో అభివృద్ధి చేశారు. ఈ ఏడాది జూన్ 12 వరకు హెచ్‌ఎంగా చేసిన ఆయన ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నారు. అదేవిధంగా గతంలో సాగరం కాలనీ ఎంపీపీ పాఠశాలల్లో పనిచేసేటప్పుడు హెల్పింగ్ హ్యాండ్ సంస్థ సహకారంతో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం, నోట్ పుస్తకాలు, పాలు వంటివి పంపిణీ చేయించారు. చింతలూరు పాఠశాలలో అక్కడ క్వారీ యాజమాన్యం సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
2019లో చింతలూరు పాఠశాలలో పనిచేసేటప్పుడు ఆయనకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం లభించింది. వీరనారాయణం పాఠశాలలో పనిచేసేటప్పుడు మండల స్థాయి అవార్డు పొందారు. తన బోధన, బోధనేతర కార్యక్రమా లతో ఆదర్శంగా నిలిచారు.

చదివిన చోటే బోధకుడిగా..