
రక్త కన్నీరు
అనకాపల్లి టౌన్: స్కూల్లో టీచర్స్ డే వేడుకలు.. ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు చెప్పడానికి పూలు తీసుకొని బయల్దేరారు ఆకాష్, అనీష. వారిద్దరూ కవల పిల్లలు. తాను టీచర్ వేషం వేస్తానని చీర కట్టుకొని తయారైంది అనీష. తాము చదువుతున్న ఏఎంఏఏ హైస్కూల్‌కు ఆటోలో బయలుదేరారు. కొద్ది నిమిషాల్లోనే విధి వక్రించింది. మార్గంమధ్యలో కృష్ణాపురం వద్ద పంది అడ్డం రావడంతో ఆటో డ్రైవర్‌కు స్టీరింగ్ కంట్రోల్ తప్పింది. వారి వాహనం బోల్తా పడి ఆటోలో ఉన్న ఆకాష్ (14) అక్కడిక్కడే మృతి చెందగా, చెల్లెలు అనీష కాలికి తీవ్ర గాయమయింది. ఆటోలో ప్రయాణిస్తున్న మ రో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన అనీషాను వెంటనే ఎన్టీఆర్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అన్న చెల్లెలు ఇద్దరూ తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ఆకాష్ తండ్రి స్థానిక జేఎంజే హైస్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నారు. కోటి ఆశలకు ఆలంబనగా ఉన్న తమ కుమారుడిని విగ త జీవిగా చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు.
ఆకాష్ కళ్లు సజీవం
అంత దుఃఖంలోనూ ఆకాష్ తల్లిదండ్రులు ఆదర్శంగా నిలిచారు. తమ కుమారుడి నేత్రాలను దానం చేశారు. ఒకపక్క కన్నీరు మున్నీరవుతూనే బాధ్యత గా ఆలోచించారు. తమ చిన్నారి మరణించినా కళ్ల ను సజీవంగా నిలిపారు.
చుట్టుపక్కల గ్రామస్తుల ఆందోళన
పంది ఆటోకు అడ్డంగా రావడంతో ప్రమాదం జరిగిన నేపథ్యంలో మృతుని స్వగ్రామమైన రామాపురం చుట్టుపక్కల గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. విచ్చలవిడిగా తిరుగుతున్న పందులే ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఆగ్రహిస్తూ రామాపురం రోడ్‌పై బైఠాయించి నిరసన తెలిపారు.