
ఏసీబీ వలలో వీఆర్వో
కశింకోట: భూమి బదిలీ (మ్యుటేషన్) కోసం రైతు నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటూ వీఆర్వో గన్నమరాజు సూర్యకృష్ణ పృధ్వీ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. విశాఖ రేంజి ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ నాగేశ్వరరావు గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. కశింకోట మండలం జెట్టపురెడ్డితుని శివారు నరసింగబిల్లికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు తమ తల్లి పేరిట ఉన్న 2.10 ఎకరాల భూమిని తమ పేరిట బదిలీ చేసి పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని గత నెలలో దరఖాస్తు చేశారు. రైతు ఊడి నాగేశ్వరరావు చేసిన ఈ దరఖాస్తును పరిశీలించిన వీఆర్వో గన్నమరాజు సూర్యకృష్ణ పృధ్వీ రూ.40 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేమని నాగేశ్వరరావు చెప్పగా.. చివరకు రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు విశాఖ రేంజి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రైతు నుంచి వీఆర్వో రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. వీఆర్వోను అరెస్టు చేశామని, శుక్రవారం అతడిని విశాఖ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.

ఏసీబీ వలలో వీఆర్వో