
ఉపమాక వెంకన్న ఆభరణాలు భద్రం
రుషికొండ ఆలయంలో ఆభరణాలను లెక్కిస్తున్న టీటీడీ ఇన్వెంటరీ సిబ్బంది
నక్కపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వర స్వామి ఆభరణాలు భద్రంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. స్వామివారికి వెలకట్టలేని వజ్రవైఢూర్యాలు, స్వర్ణాభరణాలు, వెండి ఆభరణాలు ఉన్నాయి. వీటిని భధ్రతా కారణాల రీత్యా విశాఖ సబ్ ట్రెజరీలో ఉంచారు. ఏటా వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం టీటీడీ చీఫ్ అకౌంట్ ఆఫీసరు వెంకటరమణ ఇన్వెంటరీ సూపరింటెండెంట్ ముని చెంగలరాయుడుల ఆధ్వర్యంలో టీటీడీ ఇన్వెంటరీ సిబ్బంది రుషికొండ వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి ఆభరణాలను లెక్కించారు. సబ్ ట్రెజరీల్లో భద్రపరచిన ఆభరణాల ప్రాప్తికి రికార్డుల ప్రకారం ఉన్నాయా అనేది ఆడిట్ నిర్వహించారు. అన్ని ఆభరణాలను పూర్తిగా పరిశీలించి జీఎస్టీతో కూడిన రశీదు, ధర్మకాటా రశీదులతోపాటు, దాతలు స్వామివారికి సమర్పించే ఆభరణాలకు సంబంధించి ముందుగానే తగిన వివరాలను తెలియజేస్తూ లేఖను సమర్పించాల్సి ఉంటుందని ఇన్వెంటరీ అధికారులు చెప్పారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆడిటర్ వై గురుప్రసాద్, రుషికొండ దేవస్థానం ఏవో ఎస్ జగన్మోహనాచార్యులు, సూపరింటెండెంట్ వెంకటరమణ, అప్రైజర్ ఎన్ మునిశేఖరాచారి, ఉపమాక దేవస్థానం ఇన్‌స్పెక్టర్ కూర్మేశ్వరరావు, దేవస్థాన ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు పాల్గొన్నారు.