
వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి
● ‘ఉల్లాస్ అక్షరాంధ్ర’ లక్ష్యం సంపూర్ణ అక్షరాస్యతే ● జిల్లాలో 2,85,398 మంది వయోజన నిరక్షరాస్యులు ● కలెక్టర్ విజయ కృష్ణన్
తుమ్మపాల: నిరక్షరాస్యులైన వయోజనులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఉల్లాస్ అక్షరాంధ్ర’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ కోరారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వయోజన విద్యాశాఖ, పారిశ్రామిక అభివృద్ధిపై వేర్వేరుగా జరిగిన సమావేశాల్లో కలెక్టర్ మాట్లాడారు. గ్రామ, వార్డు సచివాలయ శాఖ–2023 సర్వే ప్రకారం జిల్లాలో 2,85,398 మంది వయోజనులను నిరక్షరాస్యులుగా గుర్తించామన్నారు. మొదటి విడతగా ఈ ఏడాది 89,944 మందిని తీసుకుని అక్షరాస్యులుగా చేయడానికి ప్రణాళిక రుపొందించాలని డీఆర్‌డీఏ, డ్వామా, మెప్మా అధికారులను ఆదేశించారు. రానున్న మూడేళ్లలో మొత్తం 2,85,398 మందిని కూడా అక్షరాస్యులుగా తీర్చిదిద్ది, అక్షరాస్యతలో మొదటి స్థానంలోకి జిల్లాను తీసుకురావాలని చెప్పారు. గత సంవత్సరం 24 మండలాల్లో నిరక్షరాస్యులైన డ్వాక్రా గ్రూపు మహిళలను గుర్తించి అక్షరాస్యులుగా తయారు చేశామన్నారు.
●మండల, గ్రామ స్థాయిలో వాలంటరీ టీచర్స్‌ను పది మంది చొప్పున కేటాయించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సంక్షేమ సహాయకులు, డిజిటల్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రాబోయే ఆరు నెలల కాలంలో రోజూ సాయంత్రం 5 నుంచి 6.30 గంటల మధ్యలో అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో తరగతులు నిర్వహించాలని సూచించారు. ఆగస్టు నుంచి 2026 ఫిబ్రవరి వరకు 100 గంటల తరగతులు నిర్వహించాలన్నారు.
పరిశ్రమల స్థాపనకు అవసరమైన చర్యలు
జిల్లా పారిశ్రామిక అభివృద్ధి, పరిశ్రమల స్థాపనకు అవసరమైన చర్యలు సత్వరమే తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) 15వ జిల్లా స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏకగవాక్ష విధానం కింద గత మే 26న జరిగిన సమావేశం నుంచి ఇప్పటి వరకు 685 దరఖాస్తులు వివిధ శాఖల అనుమతి కోసం రాగా.. వాటిలో 615 దరఖాస్తులకు ఆమోదం తెలిపామన్నారు. పెండింగ్ దరఖాస్తుల అనుమతులపై వివిధ శాఖల అధికారులతో మాట్లాడాలన్నారు. జిల్లాలో 14 పరిశ్రమలకు సంబంధించిన వివిధ రాయితీల కోసం 37 దరఖాస్తులకు గాను రూ.5.92 కోట్లకు కమిటీలో ఆమోదం తెలిపామన్నారు. జిల్లాలో 43 భారీ పరిశ్రమల స్థాపనకై ప్రతిపాదనలు వివిధ దశల్లో ఉండగా, వీటి ద్వారా రూ.2,81,760 కోట్ల పెట్టుబడితో పాటు 1,46,673 మందికి ఉపాధి కల్పనకు అవకాశాలు ఉన్నాయన్నారు.
●2024 అక్టోబర్ 1 నుంచి ఇప్పటి వరకు మొత్తం 196 పరిశ్రమలకు గాను 176 పరిశ్రమలను తనిఖీలు చేశామని కలెక్టర్ వివరించారు. తనిఖీలలో వివిధ శాఖల అధికారులు ఆ పరిశ్రమలకు 485 పనితీరు మెరుగుదల సూచనలు ఇచ్చారన్నారు. ఈ సమావేశంలో వయోజన విద్య శాఖ ఉమ్మడి విశాఖ జిల్లా ఉప సంచాలకుడు ఎస్.ఎస్.వర్మ, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పి.కె.పి.ప్రసాద్, ఏపీఐఐసీ జెడ్‌ఎం నరసింహారావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ ముకుందరావు, జిల్లా రిజిస్ట్రార్ మన్మథరావు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి వెంకటరమణ, జిల్లా సమన్వయ అధికారి చిన్ని కృష్ణ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి నారాయణమూర్తి, డీఈవో జి.అప్పారావునాయుడు, డీఆర్‌డీఏ, డ్వామా, మెప్మా, ఐసీడీఎస్ పీడీలు శచిదేవి, పూర్ణిమ దేవి, ఎన్.సరోజినీ, సూర్యకుమారి పాల్గొన్నారు.
విద్యా ప్రమాణాల మెరుగుకు కృషి
పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. కలెక్టర్ సమావేశ మందిరంలో మంగళవారం విద్యాశాఖ అధికారులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులు ప్రతి రోజు పాఠశాలకు హాజరయ్యేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. విదార్థులకు విద్యతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లాలో డిజిటల్ క్లాస్ రూంల వినియోగం పెరగాలని, ఉపాధ్యాయుల ఈ–హాజరు పూర్తి స్థాయిలో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో జి.అప్పారావునాయుడు, ఐసీడీఎస్ పీడీ ఎన్.సూర్యలక్ష్మి, 24 మండలాల ఎంఈవోలు పాల్గొన్నారు.