
దళిత రైతుల ఆందోళన స్పీకర్‌కు పట్టదా?
నర్సీపట్నం: రాళ్ల క్వారీని రద్దు చేయాలని ఆర్డీవో కార్యాలయం వద్ద మాకవరపాలెం మండలం జి.కోడూరు, సుభద్రయ్యపాలెం దళిత రైతులు చేస్తున్న నిరాహార దీక్ష మంగళవారానికి ఏడో రోజుకు చేరింది. ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బి.పరంజ్యోతి విచ్చేసి దళిత రైతులకు సంఘీభావం తెలిపారు. అనంతరం క్వారీ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజులుగా ఆందోళనలు, నిరసనలు చేస్తున్నా నియోజవర్గ ఎమ్మెల్యే, స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు, అధికారులకు పట్టదా? అని ప్రశ్నించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆందోళనలు చేయించి క్వారీని రద్దు చేయించారని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే కొత్తవారికి క్వారీ లీజుకివ్వడం దారుణమన్నారు. ఓట్లు వేసి గెలిపించిన బహుజన వర్గాలకు చెందిన భూములకు అన్యాయం జరుగుతుంటే కనీసం స్పీకర్ స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ క్వారీ అనుమతులు రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ప్రశ్నిస్తే మైనింగ్ చేస్తున్న బంగార్రాజు బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర నాయకుడు బొట్టా నాగరాజు, ఐబీఎస్‌పీ రాష్ట్ర మహిళా కన్వీనర్ లక్ష్మి, జిల్లా మహిళా నాయకురాలు తులసి, కాంగ్రెస్ నాయకులు బొంతు రమణ, కేవీపీఎస్ నాయకులు చిరంజీవి, కొల్లు గంగాధర్, సూరిబాబు, అప్పారావు, పెంటయ్య, మారేసు, దేముడు, లోవరాజు, వంశీ, శివ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.