
స్పెషల్ ఒలింపిక్ క్రీడా పోటీల్లో ప్రతిభ
రావికమతం: జాతీయ స్థాయి దివ్యాంగుల స్పెషల్ ఒలింపిక్ భారత్ బోసి బాల్ క్రీడా పోటీల్లో రావికమతం మండలం కేబీపీ అగ్రహారానికి చెందిన నక్కరాజు బాల సరస్వతి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచింది. మానసిక విద్యార్థుల జాతీయ స్థాయి స్పెషల్ ఒలింపిక్ భారత్ క్రీడా ఛాంపియన్‌షిప్ –2025 పోటీలు ఈ నెల 24 నుంచి 28 వరకూ చత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్‌పూర్‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయి యూనివర్శిటీ స్టేడియంలో జరిగాయి. బోసి బాల్ గేమ్ పోటీల్లో దేశంలోని 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి మేధో, నాడీ సంబంధిత వైక్యల్యం కలిగిన బాలురు, బాలికలు పాల్గొన్నారు. ఏపీ రాష్ట్రం నుంచి ఆరుగురు బాలురు, బాలికలు పాల్గొనగా వారంతా పతకాలు సాధించారు. వారిలో రావికమతం మండలం కేపీబీ అగ్రహారానికి చెందిన బాల సరస్వతి ఏపీ తరఫున ప్రాతినిధ్యం వహించి బోసి బాల్ గేమ్ వ్యక్తిగత విభాగంలో నాలుగో స్థానంలో నిలిచింది. స్పెషల్ ఒలింపిక్ భారత్ జనరల్ సెక్రటరీ డాక్టర్ రాజశేఖర్, ఏరియా జనరల్ మేనేజర్ ప్రమోద్ తివారి, బిలాస్‌పూర్ అటల్ బీహారీ వాజ్‌పాయ్ యూనివర్శిటీ వైస్ చాన్స్‌లార్ చేతుల మీదుగా బాల సరస్వతి పతకం మెరిట్ సర్టిఫికెట్‌ను అందుకుంది.
జాతీయ స్థాయిలో జరిగిన బోసి గేమ్‌లో ఏపీ రాష్ట్రం నుంచి పాల్గొన్న ఆరుగురు క్రీడాకారులకు కోచ్‌గా రావికమతం మండలం మేడివాడ జెడ్పీ హైస్కూల్ స్కూల్ ఆసిస్టెంట్, ప్రత్యేక ఉపాధ్యాయులు మహాక్ష్మినాయుడు కోచ్‌గా వ్యవహరించారు. బోసి బాల్ గేమ్ జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి నాలుగో స్థానంలో నిలిచిన బాల సరస్వతిని కోచ్ మహాక్ష్మినాయుడును, జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ జయప్రకాష్ నాయుక్, సహిత విద్యా సమన్వయ అధికారి రామకృష్ణ నాయుడు మంగళవారం అభినందించారు.