
రెవెన్యూ శాఖలో దళారుల రాజ్యం
నక్కపల్లి: రెవెన్యూ శాఖ పనితీరుపై కూటమి పార్టీలకు చెందిన ఎంపీటీసీలు ఆరోపణలు గుప్పించారు. బ్రోకర్ల ద్వారానే పనులు జరుగుతున్నాయని, తహసీల్దార్ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారాయంటూ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం నక్కపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ ఏనుగుపల్లి రత్నం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీకి చెందిన కాగిత ఎంపీటీసీ ఆకేటి గోవిందరావు, టీడీపీకి చెందిన డీఎల్ పురం ఎంపీటీసీ కొండ్ర కనకారావు తదితరులు మాట్లాడుతూ రెవెన్యూ కార్యాలయంలో ఏ పని జరగాలన్నా బ్రోకర్లను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. సాయంత్రం అయ్యేటప్పటికీ తహసీల్దార్ కార్యాలయం బ్రోకర్లతో నిండిపోతోందన్నారు. అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యులే తమ ప్రభుత్వంలో కీలకమైన రెవెన్యూ శాఖపై ఆరోపణాస్త్రాలు సంధించడంతో మిగిలిన ప్రతిపక్ష సభ్యులు విస్తుపోయారు. కీలకమైన రెవెన్యూ శాఖ పని తీరు ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటంటూ నిలదీశారు. తక్షణమే రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాలన్నారు. అనధికార వ్యక్తులు కార్యాలయాల్లో తిష్టవేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వీఆర్వోలు గ్రామాల్లో అందుబాటులో ఉండటం లేదని, సచివాలయాలకు వెళ్తే తాము తహసీల్దార్ కార్యాలయాల్లో ఉన్నామని సమాధానం చెబుతున్నారన్నారు. అక్కడకు వెళ్లినా కనిపించడం లేదన్నారు. ఈ అంశాలపై మండల సమావేశంలో తీర్మానం చేసి కలెక్టర్‌కు పంపించాలని డిమాండ్ చేశారు.
వైస్ ఎంపీపీ వెలగా ఈశ్వరరావు మాట్లాడుతూ జలజీవన్ మిషన్ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయన్నారు. గ్రామాల్లో తాగునీరు సరఫరా కావడం లేదన్నారు. కాగితలో 15 రోజుల నుంచి తాగునీరు సరఫరా కావడం లేదని సర్పంచ్ పోతం శెట్టి రాజేష్ ఫిర్యాదు చేశారు. ఉద్డండపురంలో చెత్తను వేసేందుకు స్థలం కొరత ఉందని, డంపింగ్ యార్డ్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని సర్పంచ్ వెంకటేష్ కోరారు. ప్రతి సమావేశానికి మండల స్థాయి అధికారులు రావడం లేదని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని వేంపాడు ఎంపీటీసీ కుంచ మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో సభ్యులు ప్రస్తావించిన అంశాలను తీర్మానం చేసి తదుపరి చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు పంపిస్తామని ఎంపీపీ రత్నం తెలిపారు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో సీతారామరాజు, జెడ్పీటీసీ సభ్యుడు గోసల కాసులమ్మ, వైస్ ఎంపీపీ వీసం నానాజీ, డిప్యూటీ ఎంపీడీవో చలపతిరావు, డిప్యూటీ తహసీల్దార్ నారాయణరావు, పీఏసీఎస్ పర్సన్ ఇన్‌చార్జ్‌లు, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఏజెంట్ల ద్వారానే పనులు
అవినీతికి అడ్డాగా తహసీల్దార్ కార్యాలయాలు
నక్కపల్లి మండల సమావేశంలో కూటమి ఎంపీటీసీలు ధ్వజం