వాహన చోదకుల కంట్లో ఫ్లైయాష్‌ | - | Sakshi
Sakshi News home page

వాహన చోదకుల కంట్లో ఫ్లైయాష్‌

May 1 2025 2:13 AM | Updated on May 1 2025 2:13 AM

వాహన చోదకుల కంట్లో ఫ్లైయాష్‌

వాహన చోదకుల కంట్లో ఫ్లైయాష్‌

ఎన్‌టీపీసీ నుంచి పరిమితికి మించి లారీల్లో అక్రమ రవాణా

నక్కపల్లి : రాజమండ్రి నుంచి కొద్దినెలలుగా బండరాళ్లు రాంబిల్లి ప్రాంతాలకు భారీ లారీల్లో తరలిస్తున్నారు. 40 టన్నులకు మించకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ ఒక్కో లారీలో 80 టన్నుల వరకు లోడు వేసి టోల్‌ ఫీజు నుంచి తప్పించుకునేందుకు వేంపాడు, చందనాడ, ఉపమాక మీదుగా జాతీయ రహదారిపై రాకపోకలు సాగిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో ఇవే లారీల్లో పరవాడ వద్ద ఉన్న ఎన్‌టీపీసీ నుంచి వెలువడే ఫ్లైయాష్‌ను తీసుకుని కాకినాడ పోర్టుకు బయలుదేరుతున్నాయి. నిత్యం సుమారు 40 నుంచి 50 టిప్పర్‌ లారీల్లో ఈ బూడిదను 70 నుంచి 80 టన్నుల వరకు లోడింగ్‌ చేసి తీసుకెళ్తున్నారు. టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు చేసి ఓవర్‌ లోడ్‌ కారణంగా రూ.5 వేల వరకు పెనాల్టీ చెల్లిస్తే తప్ప టోల్‌గేట్‌లో నుంచి అనుమతించడం లేదు. దీంతో లారీ డ్రైవర్లు లారీలను కొద్దిదూరం వెనక్కి తీసుకెళ్లి సగం ఫ్లైయాష్‌ను రోడ్డుపక్కన, జాతీయరహదారి మధ్యలో అన్‌లోడ్‌ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే ద్విచక్రవాహన చోదకులు, ఆటోల్లోను, బస్సుల్లోను ప్రయాణించేవారి కళ్లల్లో ఈ బూడిద పడి కళ్లు మండడం, సరిగ్గా కనిపించకపోవడం నీరు కారడం వంటి సమస్యలు వస్తున్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కన, మధ్యలో అన్‌లోడ్‌ చేసిన బూడిద విపరీతంగా వీచే గాలుల వల్ల దుమ్ము, ధూళి కలిపి సుడిగాలి మాదిరిగా చెలరేగి, అటువైపు రాకపోకలు సాగించేవారి కళ్లల్లో పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు లారీ డ్రైవర్లు అధిక లోడుతో ఉన్న లారీలను ఉపమాక, చందనాడ, అమలాపురం, వేంపాడు మీదుగా జాతీయ రహదారిపై చేరుకుని టోల్‌ప్లాజా తగలకుండా వెళ్లిపోతున్నారు. ఇలా రాకపోకలు సాగించే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో వేసిన ఇరుకురోడ్ల మీదుగా వెళ్లే సమయంలో బూడిద గ్రామాల్లో వీధుల్లో పడి, ఆయా గ్రామాల వారు ఇబ్బంది పడుతున్నారు. 80 టన్నుల బరువుతో లారీలు రాకపోకలు సాగించడం వల్ల గ్రామీణ రోడ్లు శిథిలమవుతున్నాయని, ఎక్కడికక్కడ గోతులు పడుతున్నాయంటూ వారు ఆరోపిస్తున్నారు. ఇలా అధిక లోడుతో ఫ్లైయాష్‌ను తీసుకుని వెళ్తున్న మూడు ట్రిప్పర్‌ లారీలను నక్కపల్లి సీఐ కుమారస్వామి పట్టుకుని కేసులు నమోదు చేశారు. అయినప్పటికీ ఈ దందా ఆగడం లేదు. ఉమ్మడి విశాఖ, కాకినాడ జిల్లాలకు చెందిన కొందరు కూటమి పెద్దల అండదండలు ఉండడంతో పోలీసులు, రవాణా శాఖ అధికారులు వీటిపై కన్నెత్తి చూడడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి ఫ్లైయాష్‌ అక్రమ రవాణాకు అడ్డుకట్టవేయాలని, ఎక్కడపడితే అక్కడ అన్‌లోడ్‌ చేస్తున్న లారీలపై కేసులు నమోదు చేసి వాహన చోదకుల కంటి చూపు కాపాడాలని పలువురు కోరుతున్నారు.

కూటమి నేతల అండదండలు

టోల్‌ప్లాజాల వద్ద తనిఖీలు

పెనాల్టీ కట్టకుండా రోడ్లపైనే

అన్‌ లోడింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement