మన్యం కాఫీ పరిశోధనకు స్వర్ణ పరిమళం! | - | Sakshi
Sakshi News home page

మన్యం కాఫీ పరిశోధనకు స్వర్ణ పరిమళం!

Oct 14 2026 1:41 AM | Updated on Oct 14 2026 1:41 AM

ఐదు దశాబ్దాల ప్రస్థానం

గోల్డెన్‌ జూబ్లీకి ఆర్‌వీ నగర్‌ ఆర్‌సీపీఎస్‌ సిద్ధం

గిరిజన రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు

1.30 లక్షల కుటుంబాలకు జీవనాధారం

ఏటా 15 వేల మెట్రిక్‌ టన్నుల

క్లీన్‌ కాఫీ దిగుబడి

అధిక దిగుబడినిచ్చే వంగడాల అభివృద్ధి

తెగుళ్ల నివారణపై ప్రత్యేక పరిశోధనలు

రైతులకు రాయితీ పరికరాలు,

విద్యార్థులకు ఉపకార వేతనాలు

24 గంటలూ సాంకేతిక సలహాలు

గూడెంకొత్తవీధి మండలం ఆర్‌వీ నగర్‌ ప్రాంతీయ కాఫీ పరిశోధనా స్థానం గోల్డెన్‌ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతోంది. పరిశోధనలు, నూతన వంగడాలు, ఆధునిక సాగు పద్ధతులతో మన్యం కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో తనదైన ముద్ర వేసిన ఈ కేంద్రం స్వర్ణోత్సవ వేడుకలను నవంబర్‌లో చింతపల్లిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

చింతపల్లి: ఒకప్పుడు 50 ఎకరాలకే పరిమితమైన మన్యం కాఫీ సాగు.. నేడు లక్షల ఎకరాలకు విస్తరించింది. గిరిజన కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూ, అంతర్జాతీయ స్థాయిలో మన్యం కాఫీకి గుర్తింపు తీసుకొచ్చిన ఈ ప్రస్థానంలో ఆర్‌వీ నగర్‌ ప్రాంతీయ కాఫీ పరిశోధనా స్థానం కీలక పాత్ర పోషిస్తోంది. ఐదు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఈ పరిశోధనా కేంద్రం గోల్డెన్‌ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతోంది. గూడెంకొత్తవీధి మండలం రాఘవేంద్రనగర్‌(ఆర్‌వీ నగర్‌)లో 1976 మార్చి 28న అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు శంకుస్థాపన చేసిన ఈ కేంద్రం.. కాఫీ సాగులో నూతన వంగడాల అభివృద్ధి నుంచి రైతులకు సాంకేతిక సలహాల అందజేత వరకు విశేష సేవలందిస్తోంది. ఈ నేపథ్యంలో నవంబర్‌లో చింతపల్లిలో గోల్డెన్‌ జూబ్లీ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆర్థికాభివృద్ధికి బాటలు

మన్యంలో కాఫీ సాగు విస్తరణ గిరిజనుల ఆర్థికాభివృద్ధికి బాటలు వేసింది. ప్రస్తుతం సుమారు 2.58 లక్షల ఎకరాల్లో కాఫీ సాగవుతుండగా, సుమారు 1.30 లక్షల కుటుంబాలు ఈ పంటపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. ఏటా 15 వేల మెట్రిక్‌ టన్నుల క్లీన్‌ కాఫీ దిగుబడి వస్తోంది. కాఫీ సాగుకు అనువైన రకాల ఎంపిక, పంట యాజమాన్య పద్ధతులపై పరిశోధనలు, రైతులకు అందుతున్న సాంకేతిక సహకారం ఈ అభివృద్ధిలో కీలకంగా నిలుస్తున్నాయి.

ఆంధ్రా, ఒడిశా రైతుల కోసమే

పరిశోధనా కేంద్రం

భారత కాఫీ బోర్డు ఆధ్వర్యంలో దేశంలో ఏర్పాటు చేసిన ఐదు కాఫీ పరిశోధనా కేంద్రాల్లో ఆర్‌వీ నగర్‌ కేంద్రం ఒకటి. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల్లో కాఫీ సాగును ప్రోత్సహించడం, గిరిజన రైతుల జీవన విధానాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేశారు. ప్రారంభంలో అటవీశాఖ 202 హెక్టార్ల భూమిని పరిశోధనల కోసం కేటాయించింది. అప్పటి నుంచి వివిధ కాఫీ రకాలపై పరిశోధనలు కొనసాగిస్తూ, ఈ ప్రాంత వాతావరణానికి అనువైన వంగడాలను గుర్తించి రైతులకు పరిచయం చేస్తున్నారు.

● సెలక్షన్‌ 5ఏ, 5బీ, 6, 8, 9, 11 రకాలను అధిక దిగుబడినిచ్చే పొడవైన రకాలుగా గుర్తించగా, చంద్రగిరి రకాన్ని మధ్యస్థ రకంగా ఎంపిక చేశారు. పసుపు ఆకుమచ్చ తెగులును తట్టుకునే లక్షణాలతోపాటు అధిక దిగుబడినిచ్చే రకాల సాగును ప్రోత్సహిస్తున్నారు.

● ఇటీవల చిక్కమగళూరులోని కేంద్ర కాఫీ పరిశోధనా సంస్థ శతాబ్ది వేడుకల సందర్భంగా సీసీఆర్‌ఐ–సురక్ష, సీసీఆర్‌ఐ–శతాబ్ది రకాలను విడుదల చేశారు. సీసీఆర్‌ఐ–సురక్ష కాండం తొలిచే పురుగు, రెక్కల పురుగు ప్రభావాన్ని తట్టుకునే లక్షణాలతో గుర్తింపు పొందగా, శతాబ్ది రకం ఈ ప్రాంత వాతావరణానికి అనువైన అధిక దిగుబడి వంగడంగా గుర్తించారు. అరబికా రకాలు కూడా మన్యం వాతావరణానికి అనుకూలంగా ఉన్నట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి.

నేల పరీక్షల నుంచి

విత్తనోత్పత్తి వరకు..

కాఫీ రైతులకు ఉపయోగపడేలా పరిశోధనా కేంద్రంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. రైతుల కాఫీ తోటల్లో మట్టి పరీక్షలు నిర్వహించి, నేల సంరక్షణ, పోషకాల యాజమాన్యంపై సిఫారసులు చేస్తున్నారు. పంటలకు సోకే తెగుళ్ల కారణాలను గుర్తించడం, వాటి నివారణకు అనుసరించాల్సిన పద్ధతులపై పరిశోధనలు చేపడుతున్నారు. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. సుమారు కోటి రూపాయల వ్యయంతో నూతన ప్రయోగశాల, కాఫీ విత్తనోత్పత్తి కేంద్రాన్ని నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చారు.

24 గంటలూ ‘కాఫీ కృషి తరంగ’ సేవలు

కాఫీ సాగు, పంట యాజమాన్యంపై రైతులకు ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసేందుకు భారత కాఫీ బోర్డు ‘కాఫీ కృషి తరంగ’ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవల ద్వారా రైతులు 24 గంటలూ సలహాలు, సూచనలు పొందవచ్చు. 080–37685003 నంబర్‌కు కాల్‌ చేయడం, మిస్డ్‌ కాల్‌ ఇవ్వడం లేదా తమ సమస్యను రికార్డు చేసి పంపడం ద్వారా అవసరమైన సమాచారం పొందే అవకాశం కల్పించారు. కర్ణాటక, కేరళ, తమిళనాడుతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.

రైతులకు పంపిణీ చేసిన మినీ యూనిట్లు

వచ్చేనెలలో వేడుకలు

ఆర్‌వీ నగర్‌ ప్రాంతీయ కాఫీ పరిశోధనా స్థానం గోల్డెన్‌ జూబ్లీ వేడుకలను నవంబర్‌లో చింతపల్లిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.కాఫీ సాగుపై చేపట్టిన పరిశోధనలు, వాటి ఫలితాలు, నూతన వంగడాలు, రైతులు సాధిస్తున్న దిగుబడులు, కాఫీ తోటల్లో సాగుచేస్తున్న అంతర పంటల వివరాలను ప్రదర్శిస్తాం. ఐదు దశాబ్దాల కాఫీ పరిశోధనా ప్రస్థానాన్ని, గిరిజన రైతుల జీవితాల్లో వచ్చిన మార్పులను ప్రతిబింబించేలా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తాం. ఈ కార్యక్రమానికి కేంద్ర కాఫీ బోర్డు ఉన్నతాధికారులతోపాటు రాష్ట్రస్థాయి ప్రముఖులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.

– డి.సునీల్‌బాబు, ఆఫీసర్‌ ఇన్‌చార్జి, కాఫీ పరిశోధన స్థానం, ఆర్‌వీనగర్‌

రైతుల సేవలో..

పరిశోధనల ఫలితాలను రైతులకు చేరవేయడంతోపాటు భారత కాఫీ బోర్డు పలు సహాయక కార్యక్రమాలను అమలు చేస్తోంది. కాఫీ గుజ్జు తీసే బేబీ పల్పర్లు, మినీ హల్లర్లు, సిమెంట్‌ కల్లాలను రాయితీపై పంపిణీ చేస్తోంది. కాఫీ రైతుల పిల్లలకు మెట్రిక్యులేషన్‌, ఇంటర్‌, డిగ్రీ తదితర విద్యా స్థాయిల్లో ఉపకార వేతనాలు అందిస్తూ విద్యాభ్యాసానికి ఆర్థిక సహకారం అందిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement