● గిరి యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం
● జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ
● నిర్మాణాలకు భూమి పూజ
పాడేరు రూరల్: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మండలంలోని డల్లాపల్లిలో ఎకో టూరిజం ప్రాజెక్టులో భాగంగా కాటేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ తెలిపారు. మంగళవారం డల్లాపల్లిని సందర్శించిన ఆమె కాటేజీల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో కాటేజీల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. సహజసిద్ధమైన ప్రకృతి అందాలను పర్యాటకులకు పరిచయం చేయడంతో పాటు గిరిజన ప్రాంతంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. త్వరలోనే కాటేజీలను అందుబాటులోకి తీసుకువచ్చి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారి చలపతిరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


