● ౖఎస్టీ జనరల్‌కు చెర్మన్ పదవి
● ఖరారు చేసిన ప్రభుత్వం
సాక్షి, పాడేరు: కొత్తగా ఏర్పాటైన అల్లూరి జిల్లా పరిషత్ తొలి చైర్మన్ పీఠం గిరిజనులకు దక్కనుంది. జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఎస్టీ జనరల్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఉమ్మడి విశాఖజిల్లా నుంచి ఇటీవల 11 మండలాలతో వేరుపడి కొత్తగా అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్ ఏర్పడింది. ఈమేరకు పాడేరు మండల పరిషత్‌లో తాత్కాలికంగా జిల్లా పరిషత్ కార్యాలయాన్ని ప్రభుత్వం ఇటీవల ప్రారంభించింది. సీఈవోతో పాటు అధికార యంత్రాంగాన్ని నియమించింది. అయితే స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో రిజర్వేషన్ల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. జిల్లాలోని 11 మండలాల పరిధిలో అధికంగా గిరిజన ఓటర్లే ఉన్నారు. ఈమేరకు జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎస్టీలకే రిజర్వ్ చేశారు.
3వసారి గిరిజనులకు అవకాశం
జిల్లా పరిషత్ చైర్మన్‌గా మూడోసారి గిరిజనులకు అవకాశం దక్కనుంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా 2001 నుంచి 2006 వరకు పాడేరు జెడ్పీటీసీగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వంజంగి కాంతమ్మ పనిచేశారు. తరువాత 2022 స్థానిక ఎన్నికలలో ఉమ్మడి విశాఖలోని మెజార్టీ జెడ్పీటీసీ స్థానాలన్నీ వైఎస్సార్సీపీ అభ్యర్థులే గెలిచారు. జెడ్పీ చైర్పర్సన్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ అవ్వడంతో అప్పటి సీఎం, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ముంచంగిపుట్టు జెడ్పీటీసీగా గెలుపొందిన ఎస్టీలో వెనుకబడిన పీవీటీజీ కులానికి చెందిన జల్లిపల్లి సుభద్రకు అవకాశం కల్పించారు. దీంతో ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌గా మొన్నటి వరకు ఉత్తమ సేవలు అందించారు. రెండు సార్లు ఎస్టీ మహిళలు ఉమ్మడి విశాఖ జెడ్పీని పాలించారు. జెడ్పీ పాలకవర్గ సమయం ముగిసిన తరువాత ఉమ్మడి విశాఖ జెడ్పీ నుంచి అనకాపల్లి, అల్లూరి జెడ్పీలు వేరుపడ్డాయి. మూడవసారి గిరిజనులు జెడ్పీ పీఠంలో కూర్చోనున్నారు.
విశాఖ జెడ్పీ బీసీ జనరల్..
అనకాపల్లి బీసీ మహిళ
విశాఖ: ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిషత్ పరిధిలోని మూడు జిల్లాల చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. విశాఖ జెడ్పీ చైర్మన్ పదవిని బీసీ జనరల్‌కు, అనకాపల్లి పదవిని బీసీ మహిళకు, అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఎస్టీ జనరల్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా జిల్లాల్లో జెడ్పీ చైర్మన్ పదవులను ఆశిస్తున్న నాయకుల్లో ఆసక్తి నెలకొంది. రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపికపై రాజకీయ పార్టీలు దృష్టి సారించే అవకాశం ఉంది.


