మాట్లాడుతున్న ఏఎస్పీ మహేంద్రసిన్హా, వేదికపై సీఐ సింహాచలం
చింతపల్లి: స్థానిక సబ్ డివిజన్ పరిధిలో ఆపరేషన్ త్రిశూల్‌పై ప్రతి గ్రామంలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత మహిళా పోలీసులపై ఉందని స్థానిక ఏఎస్పీ మహేంద్రసిన్హ్ అన్నారు. శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా చింతపల్లి పోలీస్ స్టేషన్‌లో చింతపల్లి, గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాలకు చెందిన మహిళా పోలీసులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల రక్షణ, రహదారి భద్రత, మాదక ద్రవ్యాల నిర్మూలన వంటి అంశాలపై గ్రామాల్లో అవగాహన శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతం చేయాలని సూచించారు. అలాగే గ్రామస్థాయిలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు అధికారులతో కలిసి గ్రామసభలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి సీఐ సింహాచలం, ఎస్‌ఐ వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
జి.మాడుగుల: మండలంలోని సొలభం పంచాయతీ కేంద్రాన్ని శుక్రవారం ఎస్‌ఐ సాయిరాం పడాల్ సందర్శించి, ఆపరేషన్ త్రిశూల్‌పై గిరిజనులకు అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని సూచించారు. ఘర్షణలు, అవాంతరాలకు దారితీసే చర్యలకు దూరంగా ఉండాలని కోరారు. రహదారి భద్రత, మహిళలు, పిల్లలపై నేరాల నివారణ, గంజాయి దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. గ్రామంలో శాంతియుత వాతావరణాన్ని కాపాడేందుకు పోలీసులకు ప్రజలు సహకరించాలని ఎస్‌ఐ కోరారు.


