చింతపల్లి: అల్లూరి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి గిరిజన రైతాంగాన్ని ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బాలేపల్లి వెంకటరమణ డిమాండ్ చేశారు. శుక్రవారం చౌడుపల్లి పంచాయతీ టేకులవీధిలో మండల కార్యదర్శి పెట్ట పోతురాజు అధ్యక్షతన జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణతో కలిసి ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శిస్తూ, రానున్న స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పాలని అన్నారు.జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో అన్ని పంచాయతీల్లో ఎంపీటీసీ స్థానాలకు బలమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల జాబితాను మండల కార్యదర్శికి అందించాలని సూచించారు. సమావేశంలో చిన్నారావు, మల్లేశ్వరావు, కుజ్జన్న చిన్నయ్యపడాల్ తదితరులు పాల్గొన్నారు.


