నర్సీపట్నం ప్రజలకు కూటమి బాకీ రూ.990 కోట్లు | - | Sakshi
Sakshi News home page

నర్సీపట్నం ప్రజలకు కూటమి బాకీ రూ.990 కోట్లు

Oct 10 2026 1:04 AM | Updated on Oct 10 2026 1:04 AM

● చెల్లించకపోతే బుద్ధి చెప్పడం ఖాయం

● సూపర్‌ సిక్స్‌ పథకాల పేరిట మోసం

● మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌

నర్సీపట్నం: చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండున్నరేళ్లు.. ఒక్క హామీ కూడా అమలు చేయకుండా సూపర్‌ సిక్స్‌ పేరిట ప్రజలను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ఆయన వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి స్థానిక ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో సూపర్‌ సిక్స్‌ పేరుతో ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారన్నారు. అధికారంలోకి వచ్చి 28 నెలలు కావస్తున్నా, ఇప్పటి వరకు వాగ్దానాలను నెరవేర్చలేదన్నారు. ఇచ్చిన హామీల మేరకు నియోజకవర్గ ప్రజలకు స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు రూ.990 కోట్లు బాకీ పడ్డారన్నారు. దీనికి ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఉచిత బస్సు ప్రయాణమని ఆశ చూపి 16 కేటగిరీల బస్సులు ఉండగా, కేవలం 5 కేటగిరీలకే అవకాశం కల్పించారు. ఉచిత గ్యాస్‌ సిలిండర్లు 6 ఇవ్వాల్సి ఉండగా, ఒక్కటి మాత్రమే ఇచ్చారు. నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేల చొప్పున 28 నెలలకు ఒక్కొక్క నిరుద్యోగికి రూ.84 వేలు బాకీ పడ్డారు. నియోజకవర్గంలో 10 వేల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఆడబిడ్డ నిధి కింద 18 నుంచి 59 ఏళ్లు ఉన్న మహిళలకు నెలకు రూ.15 వేల చొప్పున 28 నెలలకు ఒక్కొక్కరికి రూ.42 వేలు బాకీ పడ్డారు. 87 వేల మంది మహిళలకు రూ.367.60 కోట్లు బాకీ పడ్డారు. 50 ఏళ్లకే పింఛన్‌ నెలకు రూ.4 వేల చొప్పున 28 నెలల్లో ఒక్కొక్కరికి రూ.1.12 కోట్లు కాగా, అర్హులైన 27,500 మందికి గాను రూ.308 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఏటా రూ.20 వేలు ఇస్తామని చెప్పి, మొదటి ఏడాది ఇవ్వాల్సిన రూ.70 కోట్లు, రెండో ఏడాది బకాయిలు రూ.21 కోట్లు కలిపి నియోజకవర్గంలో 35 వేల మంది రైతులకు రూ.91 కోట్లు బాకీ పడ్డారన్నారు. నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కింద ప్రజలకు

రూ.990 కోట్లు బాకీ పడిందన్నారు.

గత పాలనలో రెండేళ్లలో రూ.341 కోట్లు

గత వైఎస్సార్‌సీపీ హయాంలో వైఎస్సార్‌ ఆసరా ద్వారా 5,228 గ్రూపులకు చెందిన 58,970 మంది మహిళలకు రూ.80 కోట్లుకు పైగా రుణమాఫీ, చేయూత అందించామని మాజీ ఎమ్మెల్యే గణేష్‌ తెలిపారు. సున్నా వడ్డీ మొదటి ఏడాది రూ.4.5 కోట్లు, రెండో ఏడాది రూ.5.5 కోట్లు కలిపి మొత్త రూ.10 కోట్లు జమ చేశాం. వైఎస్సార్‌ చేయూత 45 నుంచి 60 ఏళ్లు మహిళలకు మొదటి విడద రూ.27 కోట్లు, రెండో విడత రూ. 31 కోట్లు కలిపి మొత్తం రూ.58 కోట్లు అందజేశామని గుర్తు చేశారు. జగనన్న అమ్మ ఒడి ద్వారా మొదటి విడత రూ.45 కోట్లు, రెండో ఏడాది రూ.48 కోట్లు కలిపి మొత్తం రూ.93.5 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేశాం. గత వైఎస్సార్‌సీపీ కేవలం రెండేళ్ల పాలనలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.341 కోట్లు నేరుగా అందించామని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు బాకీ ఉన్న రూ.990 కోట్లు చెల్లించకపోతే ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు, పార్టీ టౌన్‌ అధ్యక్షుడు ఏకా శివ, నాలుగు మండలాల అధ్యక్షులు నాగేశ్వరరావు, చిటికెల రమణ, పాణిశాంతరామ్‌, శానాపతి వెంకటరత్నం, మాజీ జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, మాజీ ఎంపీపీ రుత్తల సత్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement