చింతపల్లి: జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ డి. ఆదిలక్ష్మి శుక్రవారం తెలిపారు. ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు జిల్లాలో వాతావరణ పరిస్థితుల వివరాలను వెల్లడించారు. చింతపల్లి, పాడేరు, అరకులోయ డివిజన్ల పరిధిలో 0.3 నుంచి 0.5 మిల్లీమీటర్ల మేర తేలికపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 28.5 నుంచి 29.5 డిగ్రీల సెల్సియస్ మధ్య, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18.1 నుంచి 18.5 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. గాలిలో సాపేక్ష ఆర్ద్రత ఉదయం వేళల్లో 80 నుంచి 83 శాతం, మధ్యాహ్నం సమయంలో 50 నుంచి 58 శాతం మధ్య ఉండవచ్చన్నారు. గాలులు గంటకు 4 కిలోమీటర్ల వేగంతో వీచే సూచనలు ఉన్నాయని తెలిపారు. ఆకాశం 2 నుంచి 4 ఆక్టాల మేర మేఘావృతమై ఉండే అవకాశం ఉందన్నారు. రైతులు పంటల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ ఆదిలక్ష్మి సూచించారు.


