నలుగురు మావోయిస్టుల లొంగుబాటు | - | Sakshi
Sakshi News home page

నలుగురు మావోయిస్టుల లొంగుబాటు

Feb 2 2026 7:32 AM | Updated on Feb 2 2026 7:32 AM

నలుగురు మావోయిస్టుల లొంగుబాటు

నలుగురు మావోయిస్టుల లొంగుబాటు

పాడేరు : చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దక్షిణ బస్తర్‌, డీకేఎస్‌జెడ్‌సీ ప్రాంతానికి చెందిన నలుగురు మావోయిస్టులు ఎస్పీ అమిత్‌బర్దర్‌ ఎదుట ఆదివారం పాడేరులో స్వచ్ఛందంగా లొంగిపోయారు. వివరాలను ఎస్పీ అమిత్‌బర్దర్‌ విలేకరులకు వెల్లడించారు. దక్షిణ బస్తర్‌, కిస్టారం, బాసుగూడా ప్రాంతాల్లో పని చేస్తున్న ఏసీఎం క్యాడర్‌కు చెందిన మడవి కోసా, వెల్టి నందే అలియస్‌ కోసి, మిడియం అయితే అలియాస్‌ సంగీతతో పాటు రివల్యూషన్‌ పీపుల్స్‌ కమిటీ అధ్యక్షుడు, లాజిస్టిక్‌ సరఫరదారు మిడియం లక్కు తమ ఎదుట లొంగిపోయారన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్‌ ఆపరేషన్లు పెరగడం, ప్రాణభయ పరిస్థితులు ఏర్పడడం, మావోయిస్టు పార్టీకి ప్రజల్లో మద్దతు తగ్గిపోవడం, మావోయిస్టు కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోవడం, ప్రభుత్వ పునరావాస విధానాలు నచ్చడం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరగడం, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు కావడం వంటి కారణాలతో లొంగిపోయారని తెలిపారు. లొంగిపోయిన వారిలో ఏరియా కమిటీ మెంబర్‌ మడవి కోసా 2009లో బాలల సంఘంలో చేరి పామెడ్‌ ఏరియా కమిటీలో దళ సభ్యుడిగా, దక్షిణ ఉప జోనల్‌ బ్యూరో, కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేశాడని ఎస్పీ తెలిపారు. భద్రతా బలగాలతో జరిగిన ఏడు ఎదురు కాల్పుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నాడన్నారు. ఏరియా కమిటీ మెంబర్‌ వెల్టి సందే 2014లో గొలపల్లి ఏరియా కమిటీలో సీఎన్‌ఎంగా చేరి కిస్టారం ఏరియా కమిటీ సభ్యుడిగా పని చేశారన్నారు. 2018లో అరెస్ట్‌ అయి 2022 వరకు జైలులో ఉన్నారన్నారు. 2022లో మళ్లీ మావోయిస్టు పార్టీలో చేరి డాక్టర్‌ టీమ్‌లో శిక్షణ పొందారన్నారు. 2024లో కిస్టారం ఏరియా కమిటీ మెంబర్‌గా పదోన్నతి పొంది ప్రస్తుతం దర్బా ఏరియా కమిటీ మెంబర్‌గా కొనసాగుతున్నాడన్నారు. నాలుగు ఎదురు కాల్పుల ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడన్నారు. ఏరియా కమిటీ మెంబర్‌ మిడియం అయితే 2005లో పొలంపల్లి ఏరియా కమిటీలో సీఎన్‌ఎంగా చేరినట్టు చెప్పారు. 2007 నుంచి డీవీసీ దళంలో సభ్యురాలిగా పదోన్నతి పొంది 2024 వరకు మిలటరీ కంపెనీ–1లో పని చేసి ఏసీఎంగా పదోన్నతి పొంది ప్రస్తుతం పామెడ్‌ ఏరియా కమిటీలో కొనసాగుతోందన్నారు. ఆమె మూడు ఆకస్మిక దాడులు, ఒక ఎదురు కాల్పుల్లో ప్రత్యక్షంగా పాల్గొందన్నారు. ఆర్‌పీసీ అధ్యక్షుడు, లాజిస్టిక్‌ సరఫరదారు మిడియం లక్కు దక్షిణ బస్తర్‌ కమిటీకి చెందిన మావోయిస్టు దళాలు, బెటాలియన్లకు ఆహారం, సామగ్రి, లాజిస్టిక్‌ సేవలు అందజేశారని వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు పునరావాసం కల్పిస్తామని, ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని ప్రయోజనాలను అందజేస్తామని తెలిపారు. లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్న మావోయిస్టులు తమ కుటుంబాల ద్వారా సమీపంలో ఉన్న పోలీస్‌ స్టేషన్ల వద్ద లేదా నేరుగా తమ వద్దకు వచ్చి స్వచ్ఛందంగా లొంగిపోవచ్చని ఎస్పీ సూచించారు.

వివరాలు వెల్లడించిన ఎస్పీ అమిత్‌బర్దర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement