ఆధునిక యాజమాన్య పద్ధతులతో మేలైన దిగుబడులు
సబ్బవరం: రైతులు ఆధునిక వ్యవసాయ యాజమాన్య పద్ధతులను ఆచరించడం ద్వారా ఆశించినంత దిగుబడులను సాధించవచ్చని అనకాపల్లి జిల్లా వ్యవసాయ అఽధికారి ఎం.ఆశాదేవి తెలిపారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా మండలంలోని అమృతపురం గ్రామంలో మంగళవారం పంట పొలాలను సందర్శించి, రైతులతో చర్చించారు. ఈ రబీ సీజన్‌లో అవసరమయ్యే విత్తనాలను రైతు సేవా కేంద్రాల ద్వారా అందించనున్నట్లు పేర్కొన్నారు. త్వరలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేసి రైతు నుంచి ధాన్యం సేకరిస్తామన్నారు. సంబంధిత రైతులకు రావాల్సిన సొమ్మును 24 గంటల్లో చెల్లించనున్నట్లు వెల్లడించారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ సంబంధించిన ఫిర్యాదులుంటే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ గౌరి, ఎంపీటీసీ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి పోతల సత్యనారాయణ, గ్రామ పెద్దలు బైలపూడి రామారావు, ఏఈవో బాలరాజు, వీహెచ్‌ఏ భావన, వీఏఏలు రేణుక, అలేఖ్యతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.


