చెదలు
● నవ్వి పోదురు గాక.. మాకేంటి సిగ్గు
ఏయూ దూర విద్యకు
చేతి రాతతో డిగ్రీ థర్డ్ సెమిస్టర్ హిందీ క్వశ్చన్ పేపర్ తయారీ స్టడీ సెంటర్లకు పేపర్‌ను మెయిల్ చేస్తుండడంపై విస్మయం వాటిని ప్రింట్లు తీసి విద్యార్థులకు పంపిణీ చేస్తున్న నిర్వాహకులు
విశాఖ సిటీ: ఆంధ్రా యూనివర్సిటీ దూర విద్యకు చెదలు పట్టింది. ఈ విభాగం అధికారుల తీరు విమర్శలకు దారి తీస్తోంది. వీరి నిర్లక్ష్యంతో వందేళ్ల వర్సిటీ పరువు మంటగలుస్తోంది. దూర విద్య పరీక్షల నిర్వహణ నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఏటా వేలాది మందికి నిర్వహించే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పరీక్షలకు ప్రింటెడ్ ప్రశ్నా పత్రాలు ఇవ్వకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. నవ్విపోదురు గాక.. మాకేంటి సిగ్గు అన్నట్లు ప్రైవేటు స్కూళ్లు కూడా ఇవ్వని విధంగా చేతి రాతతో ప్రశ్నా పత్రాన్ని తయారు చేసి దాన్ని స్కాన్ చేసి స్టడీ సెంటర్లకు పంపిస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మెయిల్‌కు వచ్చిన క్వశ్చన్ పేపర్‌ను స్టడీ సెంటర్ల నిర్వాహకులు ప్రింట్లు తీసుకుని విద్యార్థులకు పంపిణీ చేస్తుండడం గమనార్హం.
చేతి రాతతో హిందీ ప్రశ్నా పత్రం
ఆంధ్రా యూనివర్సిటీ దూర విద్య డిగ్రీ థర్డ్ సెమిస్టర్ పరీక్షల ప్రశ్నా పత్రాలను చూసిన విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. హిందీ ప్రశ్నా పత్రాన్ని చూసిన వారంతా ఇది ఒరిజినల్ పేపరా? కాదా? అన్న సందేహ స్థితిలో ఉండిపోయారు. చిన్న చిన్న వీధి బడుల్లో కూడా లేని విధంగా చేతి రాతతో ఉన్న క్వశ్చన్ పేపర్ ఇవ్వడంపై స్టడీ సెంటర్ల నిర్వాహకులే కాకుండా విద్యార్థులు సైతం కంగుతిన్నారు. శతాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్న ప్రతిష్టాత్మక ఏయూ పరీక్షల నిర్వహణ మరీ ఇంత అధ్వానంగా ఉంటుందా? అని నవ్వుకుంటున్నారు. సాధారణంగా ఇతర యూనివర్సిటీలు ప్రింటెడ్ ప్రశ్నా పత్రాలను పరీక్షలకు ముందు రోజే స్టడీ సెంటర్లకు, కాలేజీలకు పంపిస్తుంటాయి. కానీ ఏయూ దూరవిద్య అధికారులు మాత్రం చేతితో క్వశ్చన్ పేపర్ రాసి దాన్ని స్కాన్ చేసి స్టడీ సెంటర్లు, కాలేజీలకు మెయిల్‌లో పంపిస్తుండడం విశేషం. ఆ పేపర్‌ను నిర్వాహకులు జెరాక్సులు తీసి పరీక్షలకు వచ్చే విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు.
ఏయూ పరువు తీసిన అధికారులు
ఏయూ డిస్టెన్స్ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు గుర్తింపు లేని స్టడీ సెంటర్లలో పరీక్షల నిర్వహణపై ఆరోపణలు వినిపిస్తుండగా.. మరోవైపు పరీక్షల నిర్వహణను గాలికి వదిలేస్తున్నారు. ఏయూ ప్రతిష్టను దిగజారుస్తున్నారు. ఈ రోజుల్లో గుర్తింపు లేని పాఠశాలల్లో కూడా చేతి రాత ప్రశ్నా పత్రాలు ఇవ్వడం లేదు. కానీ ఏయూ డిస్టెన్స్ అధికారులు మాత్రం ఇందుకు విరుద్ధంగా సరికొత్త సంప్రదాయానికి తెరలేపారు. ఏయూకు ఏటా రూ.50 నుంచి రూ.60 కోట్లు ఆదాయం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి వస్తోంది. అయినప్పటికీ.. పరీక్షా ప్రశ్నా పత్రాలను టైప్ చేసి సెంటర్లకు పంపించకుండా చేతి రాతతో రాసి మెయిల్ చేస్తుండడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చెదలు


