దారులన్నీ అమ్మ సన్నిధికే..
డాబాగార్డెన్స్ (విశాఖ): బురుజుపేటలో కొలువైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మార్గశిర మాసం మూడో గురువారం కావడంతో అమ్మవారి దర్శనం కోసం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా, రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. బుధవారం అర్ధరాత్రి నుంచే క్యూల్లో బారులు తీరారు. భక్తి ప్రపత్తులతో జరిగిన పూజల నడుమ.. స్థానిక ఎమ్మెల్యే అనుచరుల హడావుడి, ఆలయ నిర్వహణలో పోలీసుల పెత్తనం సామాన్య భక్తులను, ఆలయ సిబ్బందిని ఇబ్బందులకు గురిచేయడం గమనార్హం.
విశేషంగా పూజలు
మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు అమ్మవారికి పంచామృతాభిషేకాలు, సహస్రనామార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.05 గంటల నుంచి 1.30 గంటల వరకు స్వర్ణాభరణాలతో అలంకరించిన అమ్మవారు భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. అంతకుముందు గణపతి పూజ, పుణ్యాహవచనం, రుత్విక్ వరణ, వేద పారాయణాలు, శ్రీచక్రార్చన, లక్ష్మీ హోమం జరిపారు. భక్తులు సమర్పించిన పసుపు కుంకుమ నీళ్లతో జలాభిషేకం, భారీ ఎత్తున క్షీరాభిషేకం నిర్వహించి అమ్మవారికి పసుపు పూశారు. అనంతరం వెండి కవచాలు తొడిగి, దర్శనాలు కల్పించారు.
ఎమ్మెల్యే హవా..
ఓవైపు భక్తులు గంటల తరబడి క్యూల్లో వేచి ఉండగా, మరోవైపు స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ హవా ఆలయంలో స్పష్టంగా కనిపించింది. గురువారం జరిగిన తొలిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే, తన వెంట సుమారు 200 మంది అనుచరులను తీసుకురావడంతో ఉత్సవాల్లో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే సిఫార్సు లేఖలు, ఉత్సవ కమిటీ సభ్యుల అనుచరులతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది. ఎటు చూసినా ఎమ్మెల్యే మనుషులే కనిపించడంతో.. సామాన్య భక్తులతో పాటు విధుల్లో ఉన్న ఆలయ సిబ్బంది కూడా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
వన్‌టౌన్ సీఐనే అడగండి..
ఆలయ ఈవో పాత్ర నామమాత్రంగా మారిందనే విమర్శలు వినిపించాయి. అమ్మవారి దర్శన ఏర్పాట్ల గురించి ఎవరైనా ఈవో కె.శోభారాణిని ఫోన్‌లో సంప్రదిస్తే.. ‘నాకు సంబంధం లేదు, అంతా వన్‌టౌన్ సీఐనే అడగండి’అని బదులివ్వడం చర్చనీయాంశమైంది. ఆలయ నిర్వహణలో ఈవోకు ప్రాధాన్యత తగ్గిందా? లేక పోలీసుల పెత్తనం పెరిగిందా? అన్న అనుమానాలకు ఈ ఘటన తావిచ్చింది.
ట్రాఫిక్ అవస్థలు
భక్తులకు దేవస్థానం తరపున వాటర్ ప్యాకెట్లు అందజేశారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నదానం ఏర్పాటు చేశారు. వీవీఐపీలు, వృద్ధులు, వికలాంగులకు సీతారామస్వామి ఆలయం వైపు నుంచి దర్శనం కల్పించారు. నగరం నుంచి పాతపోస్టాఫీస్ వైపు వెళ్లే వాహనాలను టౌన్ కొత్తరోడ్డు జంక్షన్ వద్ద మళ్లించారు. సీబీఎం హైస్కూల్, పద్మానగర్ మీదుగా వన్‌టౌన్ రాణిబొమ్మ వైపు ట్రాఫిక్ మళ్లించడంతో ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయి.. వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
ఘనంగా మార్గశిర మూడో గురువారం పూజలు
కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
ఆలయంలో ఎమ్మెల్యే అనుచరుల హడావుడి
దారులన్నీ అమ్మ సన్నిధికే..


