కట్టమంచి దార్శనికతతోనే ఏయూకు బహుముఖ ప్రగతి
మద్దిలపాలెం (విశాఖ): రాష్ట్ర విద్యావ్యవస్థలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్థిరపరచుకున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు జరుపుకోవడం ముదావహమని ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వ్యవస్థాపక ఉపకులపతి సర్ కట్టమంచి రామలింగారెడ్డి జయంతి వేడుకలను బుధవారం ఏయూలో ఘనంగా నిర్వహించారు. వీసీ రాజశేఖర్ ప్రధాన పరిపాలన భవనం, స్నాతకోత్సవ మందిరం, టి.ఎల్.ఎన్ సభా హాల్ వద్దనున్న కట్టమంచి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శతాబ్దం కిందటే దార్శనికతతో ఇటువంటి మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీని స్థాపించి, అభివృద్ధి చేసిన కట్టమంచి కృషి నిరుపమానమని కొనియాడారు. ఏయూను స్థాపించిన తొలినాళ్లలోనే ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చారని గుర్తుచేశారు. కట్టమంచి ఆశయ సాధనకు అనుగుణంగా విశ్వవిద్యాలయం ఖ్యాతిని మరింతగా పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వీసీ పిలుపునిచ్చారు. రెక్టార్ ఆచార్య పి.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, ప్రిన్సిపాల్స్, డీన్లు, ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


